కార్ల కిస్తీలు కట్టలేక చోరీ | Sakshi
Sakshi News home page

కార్ల కిస్తీలు కట్టలేక చోరీ

Published Fri, Oct 28 2016 8:25 PM

కార్ల కిస్తీలు కట్టలేక చోరీ - Sakshi

గుంటూరు (పట్నంబజారు): పరిచయం ఉన్న వ్యక్తి ఇంట్లో ప్రవేశించి, అతనిని తీవ్రంగా గాయపరిచి సొమ్ముతో ఉడాయించిన కారుడ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్‌ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వివరాలను  వెల్లడించారు. 
 
చేబ్రోలు సర్కిల్‌ పరిధిలోని వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో నివాసం ఉంటున్న కూరపాటి రామోహన్‌రావు నివాసంలోకి ఈనెల 21వ తేదీన ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించాడు. రామోహన్‌రావును తీవ్రంగా గాయపరిచి రూ. 40 వేలు నగదు, 79 గ్రాముల బ్రాస్‌లెట్, చైన్, మూడు బంగారం ఉంగరాలతోపాటు, సెల్‌ఫోన్‌ అపహరించుకు పోయాడు. దీనిపై బాధితుని బంధువుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న తిరుపతికి చెందిన నిమ్మల హరీష్‌గా గుర్తించారు. తిరుపతిలో రెండు కార్లు ఉన్న హరీష్‌ కిస్తీలు కట్టలేక, పరిచయం ఉన్న రామోహన్‌రావుపై దాడి చేసి సొమ్ము అపహరించుకు పోయినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. క్లూస్‌టీమ్, సీసీ కెమెరాల ఫుటేజ్‌లు, సెల్‌ఫోన్‌ కాల్‌డేటా, టవర్‌ లొకేషన్‌ ఆధారంగా తిరుపతిలోని అలిపిరి వద్ద హరీష్‌ ఉన్నట్లు గుర్తించారు. గుంటూరు నుంచి అలిపిరి వెళ్ళిన పోలీసులు కారులో వెళుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు. అతని నుంచి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంతో ప్రతిభ కనబర్చిన చేబ్రోలు సీఐ జి.రవికుమార్, వట్టిచెరుకూరు ఎస్సై అశోక్, చేబ్రోలు ఎస్సైలు కె.ఆరోగ్యరాజు, టి.రాజ్‌కుమార్, ఏఎస్సై కోటేశ్వరరావు, కానిస్టేబుల్‌ అనంత్‌ వెంకటేశ్వర్లు, మహేష్‌లను అభినందించారు. సమావేశంలో సౌత్‌ డీఎస్పీ బి.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement