ఆన్‌లైన్‌.. సర్వర్‌ డౌన్‌! | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌.. సర్వర్‌ డౌన్‌!

Published Sat, Dec 24 2016 7:37 AM

ఆన్‌లైన్‌.. సర్వర్‌ డౌన్‌!

వారాంతంలో నెట్‌ వర్క్‌ బిజీ..బిజీ
మొరాయిస్తున్న స్వైపింగ్‌ మిషన్లు
క్యాష్‌లెస్‌ లావాదేవీలకు ఆటంకాలు
పెట్రోల్‌ బంకుల్లో గొడవలు, వివాదాలు
షాపింగ్‌ మాల్స్‌లో జనం అగచాట్లు


సరైన నెట్‌వర్క్‌ వ్యవస్థ లేకపోవడం, వారాంతంలో లావాదేవీలు పెరగడంతో ‘ఆన్‌లైన్‌’ వ్యవస్థ స్తంభిస్తోంది. సర్వర్‌ డౌన్‌ సమస్యలతో క్యాష్‌లెస్‌ చెల్లింపులకు ఆటంకం ఎదురవుతోంది. కార్డులతో పనులు ముగించుకోవచ్చని బయలుదేరిన సిటీజనులకు గొడవలు, వివాదాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పెట్రోల్‌బంకులు, షాపింగ్‌ మాల్స్‌లో కార్డులు ఉపయోగించడం కుదరడం లేదు. సర్వర్‌ డౌన్‌ అయిందని కొన్నిచోట్ల..ఆన్‌లైన్‌ నెట్‌వర్క్‌ పనిచేయడం లేదని మరికొన్నిచోట్ల బోర్డులు పెడుతున్నారు. కొన్ని షాపింగ్‌ మాల్స్‌లో ఫలానా బ్యాంకు కార్డులు మాత్రమే యాక్సెప్ట్‌ చేస్తామంటున్నారు. దీంతో చేసేదేమీ లేక కొనుగోలుదారులు వెనుదిరుగుతున్నారు.

సాక్షి, సిటీబ్యూరో:
గోషామహల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ప్రవీణ్‌ గచ్చిబౌలిలోని తన ఐటీ కంపెనీకి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మధ్యలో పెట్రోలు పోయించేందుకు గోషామహల్‌ సమీపంలోని పెట్రోల్‌ బంకుకు వెళ్లాడు. అక్కడ స్వైపింగ్‌ మిషన్‌ సర్వర్‌ డౌన్‌ అని సమాధానం వచ్చింది. మార్గమధ్యలో మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్, రేతిబౌలి, టౌలిచౌకి వరకు ఉన్న పెట్రోల్‌ బంకుల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. చివరకు టౌలిచౌకిలోని ఒక పెట్రోల్‌ బంకులో రెండు లీటర్ల పెట్రోల్‌ పోయించుకొని రూ.2 వేల నోటు ఇస్తే చిల్లర లేదని బంకు సిబ్బంది సమాధానం ఇచ్చారు. అరగంట సేపు వెయిట్‌ చేయించి చిల్లర తెచ్చి ఇచ్చారు. ఈ సమస్యల కారణంగా ఆఫీసుకు గంట ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చింది. ఇది ప్రవీణ్‌ ఒక్కరి సమస్యేకాదు. నగరంలో వీకెండ్‌లో లావాదేవీలు ఎక్కువగా ఉండి ఆన్‌లైన్‌ వ్యవస్థ స్తంభిస్తోంది స్వైపింగ్‌ మిషన్లు మొరాయిస్తున్నాయి. దీంతో క్యాష్‌లెస్‌ లావాదేవీలు వివాదాలకు కారణమవుతున్నాయి.

గ్రేటర్‌ వాసులను ‘నగదు’ రహిత లావాదేవీలు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు రహిత లావాదేవీలు ఊపందుకున్నా.. ఆన్‌లైన్‌ సర్వర్‌ డౌన్‌ సమస్యలు ఇరకాటంలో పడేస్తున్నాయి. ముఖ్యంగా వారాంతంలో ఆన్‌లైన్‌  కొనుగోళ్లు పెరగడంతో నెట్‌వర్క్‌ బిజీగా మారుతోంది. చాలాచోట్ల సర్వర్‌ డౌన్‌ కావడంతో క్రెడిట్, డెబిట్‌ కార్డులు, ఈ–వ్యాలెట్‌లు మూగబోతున్నాయి. నగదు రహిత లావాదేవీలపై ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, డిస్కౌంట్‌లు దేవుడేరుగు కానీ.. కొనుగోళ్ల అనంతరం సర్వర్‌ డౌన్‌తో వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పెట్రోల్‌ బంకుల్లో గొడవలు, షాపింగ్‌ మాల్స్‌లో జనం ఇబ్బందులకు గురవుతున్నారు.

పెట్రోల్‌ బంకుల్లో ఎక్కువ..
పెట్రోల్‌ బంకుల్లో స్వైపింగ్‌ మిషన్లు ఎక్కువగా మొరాయిస్తున్నాయి. ఇటీవల డిజిటల్‌ లావాదేవీలు పెరగడంతో సర్వర్‌ బిజీబిజీగా మారుతోంది. తాజాగా చమురు సంస్థలు కార్డుల ద్వారా పెట్రోల్, డీజిల్‌ కొనుగోళ్లపై లీటర్‌కు 0.75 శాతం డిస్కౌంట్‌ ప్రకటించాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ మహా నగరంలో  లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.73.61 పైసలు ఉండగా డిజిటల్‌ చెల్లింపుల ద్వారా లీటర్‌పై 55 పైసలు, డీజిల్‌ ధర రూ. 61.81 పైసలు ఉండగా డిజిటల్‌ చెల్లింపుల ద్వారా లీటర్‌పై 46 పైసలు డిస్కౌంట్‌గా లభిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్‌లోని పెట్రోల్‌ బంకుల్లో నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. మహానగర పరిధిలో మూడు ప్రధాన ఆయిల్‌ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోల్, డీజిల్‌ బంకులు ఉండగా అందులో ప్రతిరోజు రద్దిగా ఉండే సుమారు  220 పైగా పెట్రోల్‌ బంకుల్లో స్వైపింగ్‌ మిషన్లు ఉన్నాయి. కానీ చాలాచోట్ల అవి పనిచేయడం లేదని చెబుతున్నారు. వాహనాల్లో పెట్రోల్, డీజిల్‌ పోయించుకున్న తర్వాత స్వైపింగ్‌ మిషన్లు పనిచేయకపోవడంతో వినియోగదారులకు తిప్పలు తప్పడంలేదు. కొన్ని చొట్ల ఏకంగా  సేల్స్‌మెన్‌లు, వాహనదారుల మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి.

చిల్లర నో.....
పెట్రోల్‌ బంకులు, షాపింగ్‌ మాల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్లలో చిల్లర పెద్ద సమస్యగా  మారింది. చాలా చోట్ల రూ.2వేల నోటు తీసుకోలేమని కూడా బోర్డులు పెడుతున్నారు. కొన్ని పెట్రోలు బంకుల్లో రూ.500 పెట్రోలు పోయించుకుంటేనే రూ.2వేల నోటుకు చిల్లర ఇస్తామంటున్నారు. దీంతో పెద్ద వాహనాల్లో ఎక్కువ మొత్తంలో పెట్రోల్, డీజిల్‌ నింపుకుంటున్నారు. చిన్న వాహనదారులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు మహానగరంలో ప్రతి రోజు సగటున 40 నుంచి 50 లక్షల లీటర్ల పెట్రోల్, 30 నుంచి 40 లక్షల డీజిల్‌ అమ్మకాలు సాగుతుంటాయన్నది అంచనా. అందులో  స్వైపింగ్‌ మిషన్లపై  30 శాతం వరకు అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక కొన్ని రెస్టారెంట్లలో రూ.వెయ్యి పైన బిల్లు చేస్తేనే రూ.2 వేల నోటు తీసుకుంటామని చెబుతున్నారు. ఇక చిన్నచిన్న షాపుల్లో రెండు వేల నోటు తీసుకోవడమే మర్చిపోయారు.

Advertisement
Advertisement