గణనాథుల ‘కోట’ | Sakshi
Sakshi News home page

గణనాథుల ‘కోట’

Published Sat, Jul 30 2016 6:11 PM

గణనాథుల ‘కోట’

వినాయకచవితి, విజయదశమి వస్తున్నాయంటే కొత్తకోటలో రెండు నెలల ముందే సందడి మొదలవుతుంది. విగ్రహాల తయారీలో పేరున్న ఈ గ్రామంలో సుమారు 50 కుటుంబాల వారు ఉపాధి పొందుతున్నారు. 4 కుటీర పరిశ్రమల ద్వారా ఏటా 4వేలకు తగ్గకుండా ప్రతిమల తయారీ ఉంటుంది. విభిన్నంగా తయారు చేస్తూ ప్రత్యేకతను చాటుతున్నారు.  
కొత్తకోట(రావికమతం) : గణనాథుల ప్రతిమలు పండగకు ముస్తాబవుతున్నాయి. మరో నెల రోజుల్లో రానున్న వినాయకచవితి సందర్భంగా కొన్ని రంగులు అద్దుకొంటుండగా మరికొన్ని తయారీ దశలో ఉన్నాయి. ఈ ఏడాది మరింత విభిన్నంగా విగ్రహాలను రూపొందిస్తున్నారు. 
50 కుటుంబాలకు ఉపాధి
  కొత్తకోట గ్రామంలో 50 కుమ్మరి కుటుంబాలు ఉన్నాయి. వీరు ముందు నుంచి మట్టిపాత్రలు తయారు చేసి విక్రయించేవారు. కుండలు, డిబ్బీలు, గోళాలు, జాడీలు చేసేవారు. వాటికి డిమాండ్‌ తగ్గడంతో శైలి మార్చారు. విజయవాడ, విజయనగరం ప్రాంతాలకు వెళ్లి విగ్రహాల తయారీలో శిక్షణ పొందారు. మట్టితో పాటు ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తోనూ వినాయక ప్రతిమలు, దేవీ, గౌరీ పరమేశ్వరుల ప్రతిమలు తయారు చేస్తున్నారు. నాలుగేళ్లుగా నాలుగు కుటీర పరిశ్రమ కేంద్రాలు నెలకొల్పారు. కుటుంబ సభ్యులంతా శ్రమించి ఏటా వేల కొలది విగ్రహాలు తయారు చేస్తారు. వీటిని జిల్లాలోని పలు పట్టణాలతో పాటు విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు ఎగుమతి చేస్తున్నారు. 
ఐదంగుళాల నుంచి తొమ్మిది అడుగుల వరకు..
ఐదంగుళాల ప్రతిమలు మొదలుకొని తొమ్మిది అడుగుల వరకు విగ్రహాలు తయారు చేస్తున్నారు. వీటిలో శివుడిగా, భక్తాంజనేయుడిగా, ధురోధనుడిగా, పంచముఖ వినాయకుడిగా వివిధ ఆకతుల్లో.. ఇక వాహనాలైతే ఎలుకతో పాటు నెమలి,పులి, హంస, నంది తదితరాలు ఎన్నో తయారై ఉన్నాయి. ఈ ఏడాది 5వేల విగ్రహాలు తయారుచేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తయారీదారులు మల్లి చినసాంబమూర్తి, సత్తిబాబు, కొండబాబు, చిరంజీవి, శంకర్రావు, ములంపాక త్రినాథ్, నక్కా బుజ్జి, కిషోర్‌ తదితరులు తెలిపారు. 
 మూడు నెలలు సందడే!
ఈ మూడు నెలలూ సందడి ఉంటుంది. చిన్న ప్రతిమలను మహిళలు, పిల్లలు తయారుచేస్తారు. 2 అడుగుల నుంచి తొమ్మిదడుగుల విగ్రహాలను అనుభవం ఉన్నవాళ్లం తయారుచేస్తాం. 5 అడుగుల విగ్రహానికి రూ.4వేల వరకు అవుతుంది. 6,7,8,9 అడుగుల విగ్రహాలకు ఖర్చును బట్టి ధర ఇంకా నిర్ణయించాలి. గతేడాది కష్టానికి తగ్గ ఫలితం కన్పించలేదు. ఈ ఏడాది బాగుంటుందని ఆశిస్తున్నాం.
– మల్లి సత్తిబాబు, విగ్రహాల తయారీదారుడు 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement