సీబీఐ మాజీ చీఫ్ కేవీఆర్ కుమారుడిపై సీబీఐ కేసు | Sakshi
Sakshi News home page

సీబీఐ మాజీ చీఫ్ కేవీఆర్ కుమారుడిపై సీబీఐ కేసు

Published Mon, Feb 22 2016 4:22 AM

సీబీఐ మాజీ చీఫ్ కేవీఆర్ కుమారుడిపై సీబీఐ కేసు

తప్పుడు పత్రాలతో రుణం
సీబీఐకి బ్యాంకు అధికారుల ఫిర్యాదు

 
 సాక్షి, హైదరాబాద్: సీబీఐ మాజీ డెరైక్టర్ కె.విజయరామారావు కుమారుడు శ్రీనివాస్ కళ్యాణ్‌రావుపై సీబీఐ కేసు నమోదు చేసింది. తప్పుడు పత్రాలతో బ్యాంకు ను మోసం చేసి రూ.304 కోట్ల రుణం పొందారన్న ఆరోపణలపై బెంగళూరులోని సీబీఐ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం ఈ కేసు నమోదు చేసి శ్రీనివాస్ కార్యాలయంతోపాటు చెన్నై, హైదరాబాద్‌లోని ఆయన నివాసాలపై దాడులు నిర్వహించింది. శనివా రం రాత్రి జరిపిన ఈ సోదాల్లో అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

 చెన్నై కేంద్రంగా శ్రీనివాస్ తమిళనాడు బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థకు ఎండీగా ఉన్నారు. సంస్థ పేరుతో కార్పొరేషన్ బ్యాంకు నుంచి రూ.120 కోట్లు, సెంట్రల్ బ్యాంకు నుంచి రూ.124 కోట్లు, ఆంధ్రాబ్యాంకు నుంచి రూ.60 కోట్లు రుణం తీసుకున్నారు. యంత్రాలతోపాటు వివిధ పరికరాలు కొనుగోలు కోసం ఈ రుణం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తప్పుడు బిల్లులు సమర్పించారని, ఈ విషయం అంతర్గత ఆడిటింగ్‌లో తేలిందని బ్యాంకు అధికారులకు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో రం గంలోకి దిగిన సీబీఐ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం అధికారులు ఐపీసీలోని 120(బీ) నేర పూరిత కుట్ర, 420 (మోసం), 471 (మోసం చేయాలనే ఉద్దేశంతో ఫోర్జరీ పత్రాలు సృష్టించడం), 471 (తప్పుడు పత్రాలను నిజమైనవిగా నమ్మించడం) తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన విజయరామారావు 1993 నుంచి 1996 వరకు సీబీఐ డెరైక్టర్‌గా విధులు నిర్వహిం చారు. ఈ కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, దర్యా ప్తు ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement