ఇదేం న్యాయం? | Sakshi
Sakshi News home page

ఇదేం న్యాయం?

Published Mon, Mar 6 2017 10:23 PM

cc roads with Rs .85.31 crores

♦ ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.85.31కోట్లతో సీసీ రోడ్లు
♦ పంచాయతీ తీర్మానాలు లేకుండానే ఎంపీ, ఎమ్మెల్యేల సిఫారసులు
♦ పనులు తమకే అప్పగించాలంటున్న సర్పంచులు
♦ రోడ్ల నిర్మాణానికి మార్చి 31వరకే గడువు


ఆదిలాబాద్‌ కల్చరల్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్ ఆర్‌ఈజీఎస్‌ 20:80 అభివృద్ధి పనులు అభాసుపాలవుతున్నాయి. సర్పంచ్‌ తీర్మానం లేకుండానే కార్యకర్తల పేరుతో ప్రజాప్రతినిధులు పనులు చేసి సర్పంచులకు మొండిచేయి చూపిస్తున్నారు. కొన్ని గ్రామపంచాయతీల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు 20 శాతం నిధులు కేటాయించి తమకు అనుకూలమైన కార్యకర్త పేరును పంచాయతీ ఇంజినీర్లకు సిఫారసు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

గ్రామపంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ఈ పనులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నా ప్రజాప్రతినిధులు సిఫారసులతో నిరాశ చెందుతున్నారు. అభివృద్ధి పనులు 20 శాతం వెచ్చించి ఇష్టారాజ్యంగా కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహరించడంపై ప్రజాగ్రహం కనిపిస్తోంది. ఇది గ్రామ పంచాయతీలో ప్రతిపక్ష సర్పంచులు ఉన్న ప్రాంతంలో ఈ సిఫారసుల తంతు ఎక్కువగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

నిధులు సమకూరేదిలా..
20:80 పథకంలో 20శాతం స్థానిక పంచాయతీ, ఎమ్మెల్యేలు, ఎంపీ నిధుల నుంచి గ్రామపంచాయతీలకు నిధులు కేటాయించగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధిహామీ పథకం నుంచి 80 శాతం నిధులు గ్రామాభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణానికి వెచ్చిస్తోంది. నిజానికి 20 శాతం గ్రామపంచాయతీలు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో చెల్లించి 80 శాతం నిధులు సమకూర్చుకునేందుకు గ్రామపంచాయతీల తీర్మానాన్ని తీసుకోలేదు.

20శాతం నిధులు చెల్లించడానికి  ముందుకు వచ్చినా స్థానిక ప్రజాప్రతినిధులే చెల్లిస్తున్నారని, గ్రామ పంచాయతీలకు సంబంధం లేకుండా సంబంధిత ప్రజాప్రతినిధులకు అనుకూలంగా ఉన్న ఏరియాలో పనులు చే పడుతున్నారు. ఉపాధిహామీ పథకం నిబంధనల ప్రకా రం ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వా ల్సి ఉండగా ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. గ్రామసభల ద్వారా పంపిన పనులను పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఉమ్మడి జిల్లాలో కేటాయించిన నిధులు.. పనులు
ఉపాధిహామీ పథకంలోని 20:80 ప్రకారం ఉమ్మడి జిల్లాలో రూ.85.31కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 875 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.23 కోట్లు, కుమురం భీం జిల్లాలో 471 పనులకుగాను రూ.19.57 కోట్లు, నిర్మల్‌ జిల్లాలో 444 పనులకు రూ.20.33 కోట్లు, మంచిర్యాలలో 530 పనులకు రూ.22.41 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. కాగా ఇందులో కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్‌ఈజీఎస్‌ నిధులు రూ.68 కోట్ల 24 లక్షల 80 వేలు సమకూర్చగా, ఎంపీ, ఎమ్మెల్యే, జీపీల నిధులు రూ.17 కోట్ల 6 లక్షల 20 వేలు 20 శాతం కింద జమ చేయాల్సి ఉంది.

సర్పంచులకు మొండిచేయి
ఎన్ఆర్‌ఈజీఎస్‌ నిధులతో అభివృద్ధి నిర్మాణ పనులు నిర్వహించాల్సిన ఈ పనుల్లో కొందరు సర్పంచులకు మొండిచేయి చూపుతున్నారు. 20శాతం నిధులు వెచ్చించిన ఎమ్మెల్యే, ఎంపీలను తమకు అనుకూలంగా కార్యకర్తల పేర్లను అధికారులకు సిఫారసు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో గ్రామ పంచాయతీ తీర్మానించే సర్పంచ్, వార్డు మెంబర్ల పరిస్థితి అయోమయంలో పడింది. కొందరు సర్పంచులు ఈ తీర్మానానికి అంగీకరించలేని పరిస్థితులు కనిపించగా, తాము సిఫారసు చేసిన వ్యక్తిని పనులు చేయనీయని పక్షంలో 20 శాతం నిధులను చెల్లించమనే పరోక్ష సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో సర్పంచులు కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల విధి విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.  

ముంచుకొస్తున్న గడువు
ప్రభుత్వం నిర్వహించే 20 : 80 పనులకు గడ్డుకాలం ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం ఇచ్చిన ఉత్తర్వులతో ఇప్పటివరకు ఒకటి రెండు పనులు మినహా ఎక్కడా ప్రారంభం కాలేదు. మార్చి 31లోపు ఈపనులు చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కానీ సర్పంచులు ఇంకా పనులు ప్రారంభించలేదు. గడువు ముగుస్తుందని వేగవంతంగా పనులు చేస్తే నాణ్యత లోపాలు ఏర్పడే అవకాశాలున్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు.

Advertisement
Advertisement