ఉన్నత విద్యామండలి వివాదంపై కేంద్రం కౌంటర్ దాఖలు | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యామండలి వివాదంపై కేంద్రం కౌంటర్ దాఖలు

Published Sat, Dec 5 2015 1:21 AM

Center filed counter

సాక్షి, హైదరాబాద్: ఏపీ ఉన్నత విద్యామండలి వివాదంపై సుప్రీంకోర్టు విచారణలో ఉన్న కేసుకు సంబంధించి కేంద్రప్రభుత్వం శుక్రవారం కౌంటర్ దాఖలు చేసింది. ఉమ్మడి ఏపీ ఉన్నత విద్యామండలికి చెందిన ఆస్తులు, నిధులు, ఉద్యోగాల పంపిణీకి సంబంధించి విభజన చట్టంలోని సెక్షన్లను ఉదాహరిస్తూ కేంద్రం ఈ కౌంటర్ దాఖలు చేసినట్లు ‘మండలి’ వర్గాలు తెలిపాయి. పదో షెడ్యూల్‌లో ఉన్న ఉమ్మడి సంస్థలకు సంబంధించి భూమి, భవనాలు భౌగోళికంగా ఏ రాష్ట్రపరిధిలో ఉంటే అవి ఆ ప్రభుత్వానికి చెందుతాయని.., ఉద్యోగులు, నిధులు, ఇతర చరాస్తులను జనాభా ప్రాతిపదికన రెండు రాష్ట్రాలూ పంచుకోవాలన్న ఆ చట్టంలోని నిబంధనలను ఉటంకించింది. ఉమ్మడి ఏపీ ఉన్నత విద్యామండలి విషయంలో తెలంగాణ, ఏపీ సర్కార్ల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

ఉమ్మడి మండలి సేవలు తమకవసరం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం తమ ఉన్నత విద్యామండలిని ప్రత్యేకంగా ఏర్పాటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ఏపీ ఉన్నత విద్యామండలి కార్యాలయ భవనంలోనే దానికి ఒక అంతస్తును ఏపీ మండలి కేటాయించింది. అయితే బ్యాంకు ఖాతాల విషయంలో రెండు మండళ్ల మధ్య వివాదం తలెత్తి అవి ఫ్రీజ్ కావడం, హైకోర్టులో కేసు దాఖలై తెలంగాణ మండలికి అనుకూలంగా తీర్పురాగా.. ఏపీ ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని తెలంగాణ మండలి స్వాధీనపర్చుకుంది. దీనిపై ఏపీ ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణ కొనసాగుతోంది. ఈ వివాదంపైనే సుప్రీంకోర్టు కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులివ్వడంతో కేంద్రం శుక్రవారం కౌంటర్ దాఖలు చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement