రవాణా రంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు | Sakshi
Sakshi News home page

రవాణా రంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

Published Fri, Mar 31 2017 3:52 PM

రవాణా రంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు - Sakshi

ఇచ్ఛాపురం రూరల్‌ : కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతోనే దక్షిణ భారత రాష్ట్రాల్లో రవాణా రంగం నష్టాల్లో ఉందని జిల్లా లారీ యజమానుల జేఏసీ కన్వీనర్, ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ అన్నారు. దక్షిణ భారత రాష్ట్రాల లారీల నిరవధిక బంద్‌కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో గురువారం ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి ధనరాజులమ్మ ఆలయం  వద్ద జాతీయ రహదారిపై ఇచ్ఛాపురం బోర్డర్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌(ఐబీఎల్‌ఓఏ)ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర లారీ యజమానుల సంఘ అధ్యక్షుడు ముడియా జానకిరామ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పెంచిన థర్డ్‌ పార్టీ ప్రీమియం తగ్గించాలని, రవాణా వాహనాలకు స్పీడ్‌ గవర్నర్‌ ఏర్పాటును ఉపసంహరించాలని, పెంచిన ఆర్‌టిఎ చలానా ఫీజులు, పెనాల్టీలను రద్దు చేయాలని,  టోల్‌ ఫీ రద్దు చేయాలని, ఏప్రిల్‌ 1 నుంచి తప్పనిసరిగా ఏసీ క్యాబిన్‌ ట్రక్కుల సరఫరా ఆదేశాలను ఉపసంహరించాలని, 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలను నిలుపుదల చేసే ఆలోచన విరమించుకోవాలని, ఆంధ్రా, తెలంగాణాలకు కౌంటర్‌ సిగ్నేచర్‌ పర్మిట్లు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న సీఐ ఎం.అవతారం, రూరల్‌ ఎస్సై మీసాల చిన్నంనాయుడులు సిబ్బందితో చేరుకుని సంఘ ప్రతినిధులతో చర్చించారు. అనంతరం పరిస్థితిని చక్కదిద్దారు. నిరసన కార్యక్రమంలో ఇచ్ఛాపురం బోర్డర్‌ లారీ అసోషియేషన్‌ లీగల్‌ అడ్వయిజర్‌ జీరు కామేష్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పితంబర్‌ మహంతి, కార్యదర్శి ఉలాసి శ్యాంకుమార్‌ రెడ్డి, కోశాధికారి మద్ది రాంబాబు, సభ్యులు నందిక ప్రేమ్‌కుమార్, ఉలాసి ఉమాపతి, బృందావన్‌ మహంతి, సునీల్‌ మహంతిలు పాల్గొన్నారు. వీరికి ఆటోయూనియన్‌ అధ్యక్షుడు ఉలాసి యర్రయ్య, ట్రాక్టర్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు గుజ్జు జగన్నాథంరెడ్డి, ఉప్పాడ చినబాబురెడ్డిలు మద్దతు పలికారు.

Advertisement
Advertisement