చాగల్లు షుగర్స్‌పై కొరడా | Sakshi
Sakshi News home page

చాగల్లు షుగర్స్‌పై కొరడా

Published Tue, Sep 13 2016 12:17 AM

చాగల్లు షుగర్స్‌పై కొరడా - Sakshi

కొవ్వూరు : చాగల్లులోని జైపూర్‌ షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను రాబట్టేందుకు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రయోగించిన అధికారులు ఈనెల 15న ఉదయం 11 గంటలకు కర్మాగారాన్ని బహిరంగ వేలంలో విక్రయించాలని నిర్ణయిం చారు. రైతుల నుంచి చెరకు సేకరిస్తున్న ఫ్యాక్టరీ యాజమాన్యం రెండేళ్లుగా వారికి సొమ్ము చెల్లించడం లేదు. 2014–15, 2015–16 సంవత్సరాలకు సంబంధించి రూ.70.44 కోట్లమేర బకాయిలు పేరుకుపోయాయి. దీంతో రైతులు అనేకసార్లు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. రైతు సంఘం ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ఎదుట నెల రోజులకు పైగా ఆందోళన చేశారు. అయినప్పటికీ యాజమాన్యం స్పందించలేదు.
 రైతు సంఘం నాయకులు, ఆర్డీవో, అసిస్టెంట్‌ కేన్‌ కమిషనర్‌ యాజమాన్య ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలం కాలేదు. చివరకు ఆర్డీవో బి.శ్రీనివాసరావు సారధ్యంలో రైతు ప్రతిని ధులు, అసిస్టెంట్‌ కేన్‌ కమిషనర్‌తో సంఘాన్ని ఏర్నాటు చేశారు. ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసిన పంచదార నిల్వలను విక్రయించడం ద్వారా రైతుల బకాయిలు చెల్లించాలని సంఘం నిర్ణయించింది. అందుకు యాజమాన్యం సానుకూలత వ్యక్తం చేయడంతో 12 విడతలుగా పంచదారను విక్రయించగా వచ్చిన రూ.34.61 కోట్లను 9,640 మంది రైతులకు చెల్లించారు. అయినా, బకాయిలు పూర్తిగా తీరకపోవడంతో అసిస్టెంట్‌ కేన్‌ కమిషనర్‌ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్‌ కె.భాస్కర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యంపై రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్‌) యాక్ట్‌ ప్రయోగించారు. యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినా సరైన స్పందన రాకపోవడంతో రైతు ప్రతినిధుల బృందం జూన్‌ మొదటి వారంలో చెన్నై వెళ్లి యాజమాన్యంతో చర్చించింది. అనంతరం యాజమాన్యం రూ.6.50 కోట్లను చెల్లించింది. ఈ సొమ్మును 3,300 మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా రూ.28.04 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ మొత్తాన్ని రాబట్టేందుకు ఫ్యాక్టరీని బహిరంగ వేలంలో విక్రయించాలని నిర్ణయించి వేలం ప్రకటన జారీ చేశారు.
15న వేలం వేస్తున్నాం
చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిల నిమిత్తం చాగల్లులోని జైపూర్‌ షుగర్స్‌ను ఈనెల 15న వేలం వేస్తున్నాం. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఫ్యాక్టరీ ఆవరణలోనే ఈ కార్యక్రమం నిర్వహించారు. వేలం నిర్థారణకు 30 రోజుల గడువు ఉంటుంది. ఈలోగా యాజమాన్యం ఏదైనా అప్పీల్‌ వస్తే స్వీకరిస్తాం.
–బి.శ్రీనివాసరావు, ఆర్డీవో, కొవ్వూరు
రూ.28.04 కోట్లు చెల్లించాలి
చాగల్లు జైపూర్‌ షుగర్‌ ఫ్యాక్టరీ చెరకు రైతులకు ఇంకా రూ.28.04 కోట్లు బకాయిపడింది. 2014–15లో చెల్లించాల్సిన బకాయిలను పంచదార విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును, యాజమాన్యం సర్ధుబాటు చేసిన సొమ్మును రైతులకు చెల్లించాం. మిగిలిన బకాయిల కోసం యాజమాన్యంతో రైతు సంఘం ప్రతినిధులతో పలుసార్లు చర్చించినప్పటికీ ప్రయోజనం కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను అనుసరించి రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు.
– ఎ.సీతారామారావు, అసిస్టెంట్‌ కేన్‌ కమిషనర్, తణుకు
 

Advertisement
 
Advertisement