పీఠం కదులుతోంది! | Sakshi
Sakshi News home page

పీఠం కదులుతోంది!

Published Wed, Jun 21 2017 12:05 AM

పీఠం కదులుతోంది! - Sakshi

కర్నూలులో ‘అనంత’ రాజకీయం!
- జెడ్పీ చైర్మన్‌ను మార్చేందుకు ప్రయత్నాలు
- తమకు అవకాశం ఇవ్వాలంటున్న వాల్మీకులు
- డిప్యూటీ సీఎంతో సమావేశం
- నేడు సీఎంతోనూ భేటీ?
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలోనూ అనంతపురం తరహాలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ను మార్చేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అనంతపురం జిల్లాలో జెడ్పీ చైర్మన్‌ను మార్చిన నేపథ్యంలో జిల్లాలోనూ ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లా్లో కూడా పదవీ కాలం సగానికిపైగా ముగిసిన నేపథ్యంలో తమకు పీఠం అప్పగించాలని ప్రధానంగా వాల్మీకి వర్గానికి చెందిన జెడ్పీటీసీలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో పాటు ఐడీసీ చైర్మన్‌ కేఈ ప్రభాకర్‌ను కూడా విన్నవించారు.
 
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో ఆయనను కూడా కలిసి విన్నవించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మరోవైపు కొద్దిరోజుల క్రితం వాల్మీకులు ఐక్యంగా ఉంటే జెడ్పీ చైర్మన్‌ పీఠం రాజశేఖర్‌కు దక్కేదే కాదని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ కుండబద్ధలు కొట్టారు. ఇప్పటికైనా మించిపోయింది లేదనే రీతిలో ఆయన వ్యాఖ్యనాలు చేశారు. ఇక వైస్‌–చైర్‌పర్సన్‌గా ఉన్న పుష్పావతి కూడా చైర్మన్‌ పీఠం దక్కించుకునేందుకు నేతలను కలుస్తున్నారు. మొత్తం మీద అధికార పార్టీలో జెడ్పీ చైర్మన్‌ పీఠం నీకా నాకా అనే రీతిలో ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
 
జెడ్పీ చైర్మన్‌పై గుర్రు
అధికార పార్టీలోని ఒక వర్గం జెడ్పీ చైర్మన్‌ తీరుపై గుర్రుమంటోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనకు సహకరించలేదని శిల్పా చక్రపాణిరెడ్డి నేరుగా సీఎంకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎంను కలిసే సమయంలో కూడా జెడ్పీ చైర్మన్‌ను తమతో పాటు తీసుకెళ్లలేదు. దీంతో జెడ్పీ చైర్మన్‌ కూడా పార్టీలోని కొంత మంది నేతలపై అలకబూనారు. అనంతపురం జిల్లా ఘటన నేపథ్యంలో ఇదే అదనుగా భావించి ఆయనను తప్పించేందుకు ఈ వర్గం కూడా పావులు కదుపుతున్నట్టు సమాచారం. దీంతో పాటు కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి విష్ణువర్దన్‌ రెడ్డి కూడా తన అనుచరులకు పీఠం ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, సంఖ్యాపరంగా బలంగా ఉన్న వాల్మీకి వర్గానికే జెడ్పీ చైర్మన్‌ పీఠం ఇస్తే ఎన్నికల్లో కూడా పార్టీకి కలిసి వస్తుందని వాల్మీకి వర్గానికి చెందిన జెడ్పీటీసీలు అభిప్రాయపడుతున్నారు. నౌ ఆర్‌ నెవ్వర్‌(ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు) అనే నినాదంతో ముందుకు కదలాలని.. గతంలో చేతికందిన పీఠం పోయిన అంశాన్ని వారు గుర్తుచేసుకుంటున్నారు. ఇదే అంశాన్ని నేరుగా సీఎంకు కూడా బుధవారం లేదా గురువారం వివరించే ప్రయత్నం చేస్తామని అంటున్నారు. 
 
ఢోకా లేదంటున్న చైర్మన్‌...!
జెడ్పీ చైర్మన్‌గా తన పీఠానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని చైర్మన్‌ రాజశేఖర్‌ వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. అయితే, చైర్మన్‌ పీఠం కోసం తాను వెచ్చించిన మొత్తాన్ని తిరిగి ఇస్తే వెంటనే వేరే వారికి బాధ్యతలు అప్పగిస్తామని ఆయన తన సన్నిహితుల వద్ద అంటున్నట్టు తెలిసింది. తాను రాజీనామా చేయనిదే తనను ఎవ్వరూ తొలగించలేరని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. వారిని వీరిని కలవడం ఎందుకని.. నేరుగా తమనే కలిసి తన ఖర్చులు తనకు వెనక్కి ఇచ్చేసి పీఠం దక్కించుకోవాలని కూడా ఆయన సూచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద తన పీఠాన్ని తనకు తానుగా వదులుకుంటే తప్ప వచ్చిన ఇబ్బందేమీ లేదనేది ఆయన ధీమాగా ఉంది. అయితే, ముందస్తు చేసుకున్న ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల తర్వాత తమకు పీఠాన్ని అప్పగించాలని ప్రస్తుతం పీఠం రేసులో ఉన్న నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద జెడ్పీ చైర్మన్‌ పీఠం వ్యవహారం కాస్తా అధికార పార్టీలో రెండు గ్రూపుల తగాదాకు దారితీస్తున్నట్టు కనిపిస్తోంది.

Advertisement
Advertisement