‘వాస్తు’ బాబూ.. వాస్తు | Sakshi
Sakshi News home page

‘వాస్తు’ బాబూ.. వాస్తు

Published Sun, Oct 11 2015 2:21 AM

‘వాస్తు’ బాబూ.. వాస్తు - Sakshi

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకొచ్చిన నాటి నుంచి సెంటిమెంట్, వాస్తుకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అందరికి తెలిసిందే. కార్యాలయంలో అడుగుపెట్టినా, కొత్త ఇంటిలోకి మారినా...! అన్నింటా వాస్తు చూసుకున్న తర్వాతే ఏ పని అయినా. అందుకు డబ్బు కూడా నీళ్లలా ఖర్చవుతోంది. ఈ వాస్తు సెంటిమెంట్ ఎక్కడివరకు వెళ్లిందంటే...! చివరకు పరిపాలనకు సంబంధించిన అంశాల్లోనూ వాస్తు సెంటిమెంట్‌ను జొప్పించడంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు.  సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏపీకి 13 నంబర్ అచ్చిరాదని, రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండటం సెంటిమెంట్ ప్రకారం కలిసి రాదని, మరో జిల్లా ఏర్పాటు చేయాలని పండితులు సూచించడంతో ఇప్పుడు మరో జిల్లా ఏర్పాటు చేయాలంటూ సీఎం అధికారులకు చెప్పారు.

పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు చేస్తే ప్రజలు హర్షిస్తారే తప్ప మన సెంటిమెంట్ కోసం నిర్ణయాలు ఎలా తీసుకుంటారని అధికారులు పెదవి విరుస్తున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గుంటూరు మిర్చి యార్డులో ఏదైనా కార్యక్రమం జరిగితే పదవికి గండం ఉంటుందని ప్రచారంలో ఉంది. దీంతో ఈ నెల 13న రైతుల కోసం ఈ-ట్రేడింగ్ కార్యక్రమం ప్రారంభిద్దామని భావించిన సీఎంకు ఈ విషయాన్ని ఎవరో చెవిన వేయడంతో ఇప్పుడా కార్యక్రమాన్ని విజయవాడ మార్కెట్ యార్డుకు మార్చుకున్నారట.

నిండు అసెంబ్లీలో మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అని ఎద్దేవా చేసిన చంద్రబాబు ఇప్పుడు అనుసరిస్తున్న వైఖరిని చూసి అధికారులు విస్మయం చెందుతున్నారు. రాష్ట్రంలోని పెద్దపెద్ద జిల్లాలను పాలనా సౌలభ్యం కోసం విభజించ డంలో తప్పులేదుగానీ...! సీఎం సెంటిమెంట్ కోసం కొత్త జిల్లాను మేమెక్కడ సృష్టించేదని తలలు పట్టుకుంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement