శవాలకూ బిల్లేస్తున్నారు | Sakshi
Sakshi News home page

శవాలకూ బిల్లేస్తున్నారు

Published Tue, Nov 8 2016 12:12 AM

శవాలకూ బిల్లేస్తున్నారు

సర్కారీ ఆస్పత్రుల్లో దుస్థితి
తణుకు అర్బన్‌ :
ఔను.. ఇది నిజం. జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లోనూ శవాలకు బిల్లు వేస్తున్నారు. ఠాగూర్‌ సినిమాలో చూపించినట్టు వైద్యం పేరిట కాదుగానీ.. పోస్టుమార్టం ఖర్చులంటూ సొమ్ములు వసూలు చేస్తున్నారు. అడిగినంత డబ్బు ముట్టజెప్పకపోతే మృతదేహాలు శ్మశాన వాటికకు కదిలే పరిస్థితి లేదు. అనుమానాస్పద మరణాలు, విషం మింగిన కేసులు, హత్యలు, ఆత్మహత్య కేసులకు సంబంధించి మార్చురీల్లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించాలంటే రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ముట్టజెప్పాల్సి వస్తోంది. ఏలూరులోని జిల్లా కేంద్ర ఆస్పత్రితోపాటు తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రులు, భీమవరం తదితర కేంద్రాల్లోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
 
సామగ్రి.. రసాయనాల పేరుతో..
మెడికో లీగల్‌ కేసులు (ఎంఎల్‌సీ)లుగా వ్యవహరించే అనుమానాస్పద మరణాలు, హత్యలు, ఆత్మహత్యలు వంటి కేసులకు సంబంధించి సదరు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటుంది. మృతదేహాల నుంచి గుండె, ఊపిరితిత్తులు, చిన్నపేగు, బోన్‌ వంటి అవయవాలను సేకరించి వాటిని రసాయనాలతో నింపిన పెట్టెల్లో భద్రపర్చి.. వాటిని కాకినాడ లేదా విజయవాడలేని ప్రాంతీయ ఫార్మాసిక్‌ ల్యాబొరేటరీలకు పంపించాల్సి ఉంటుంది. అవయవాలను భద్రపరిచేందుకు ప్రధానంగా ఫార్మాలిన్‌తోపాటు ఇతర రసాయనాలు, ప్లాస్టిక్‌ బాటిల్స్‌ అవసరమవుతాయి. వీటిని ప్రభుత్వమే సరఫరా చేయాల్సి ఉంది. అయితే, ప్రభుత్వం నుంచి ఇలాంటి సామగ్రి, రసాయనాలు అందటం లేదు. దీంతో వాటిని కొనుగోలు చేసేందుకు మార్చురీ సిబ్బంది మృతుల సంబంధీకుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా కాలువలో లభ్యమయ్యే మృతదేహాల పోస్టుమార్టం విషయంలో ఈ ఖర్చు మరింత ఎక్కువ అవుతోంది. కుటుంబానికి ఆధారమైన పెద్దదిక్కు పోయి బాధతో ఉన్న వారినుంచి ఇలా సొమ్ములు గుంజటం విమర్శల పాలవుతోంది. అడిగినంత సొమ్ము ఇస్తేనే.. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ణి శుభ్రంగా ఇస్తారని.. లేదంటే దానిని నిలువునా చీరేసి.. అవయవాలు బయటకు కనిపించేలా ఇస్తారనే ఆరోపణలు ఉన్నాయి. సొమ్ములు చెల్లించలేని పేద వర్గాలకు చెందిన కొన్ని మృతదేహాలకు స్థానికంగా చందాలు వసూలు చేసి తీసుకువెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో నెలకు సుమారు 300కు పైగా మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తుంటారు. ఈ తరహా వసూళ్లతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
రూ.1,500 ఇచ్చాను
మా మావయ్య ఓ ప్రమాదంలో చనిపోతే శవాన్ని తణుకు ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. మార్చురీలో పోస్టుమార్టం చేసే సమయంలో సిబ్బందికి రూ.1,500 ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకని అడిగితే.. రసాయనాలు,  సామగ్రి కొనాలని తెగేసి చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో ఆ సొమ్ము ఇచ్చాం.
ఎ.రామారావు, తణుకు
 
సరఫరా లేదు
మృతదేహాల అవయవాలను భద్రపరిచి ల్యాబ్‌లకు పంపే క్రమంలో ఉపయోగించే కెమికల్స్, సామగ్రి ప్రభుత్వమే సరఫరా చేయాల్సి ఉంది. వాటి సరఫరా లేకపోవడంతో బాధితుల నుంచే వసూలు చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల ఆస్పత్రి నిధుల నుంచి వెచ్చిస్తున్నా సరిపోవడం లేదు.
 డాక్టర్‌ కె.శంకరరావు, డీసీహెచ్‌ఎస్, ఏలూరు
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Advertisement
Advertisement