కనులపండువగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథోత్సవం | Sakshi
Sakshi News home page

కనులపండువగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథోత్సవం

Published Sun, Sep 18 2016 1:42 AM

కనులపండువగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథోత్సవం

  •  మార్మోగిన హరోం..హర నామస్మరణ
  •  జనసంద్రమైన మల్లాం
  •  
     చిట్టమూరు: శ్రీ వళ్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం మల్లాంలో స్వామి వారి రథోత్సవం కనులపండువగా సాగింది. మల్లాసుర కొల్లాసుర రాక్షసులను లోక కళ్యాణార్ధం స్వామివారు సంహరించిన అనంతరం విజయోత్సవానికి చిహ్నంగా దేవేరులతో కలసి రథంపై కొలువుదీరి మల్లాంలో విహరిస్తారు. ఈ సందర్భంగా మల్లాం గ్రామం భక్తులతో కిక్కిరిసిపోయింది. హరోం..హర నామస్మరణతో మార్మోగింది. యువతీయువకులు తమకు వివాహాలు కావాలని సుబ్రహ్మణ్యేశ్వరున్ని మొక్కుకుంటూ రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు తాము త్వరగా ఉపశమనం పొందాలని ఆకాంక్షిస్తూ తేరుపై మిరియాలు, ఉప్పుచల్లి పూజలు నిర్వహించారు. మరోవైపు రథోత్సవం సందర్భంగా ఉదయం నుంచి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించిన అశ్వరథంపై  దేవేరులతో కలిసి స్వామి వారు కొలువుదీరారు. మంగళవాయిద్యాలు, భక్తుల హరోం..హర నామస్మరణ మధ్య కార్తికేయుడి రథం ముందుకు కదిలింది. ప్రతి ఇంటి ముంగిట భక్తులు స్వామి వారికి స్వాగతం పలుకుతూ నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఊరుఊరంతా పండగ వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం ఆలయంలో భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. ఉభయకర్తలుగా చిల్లకూరు పార్థసారధిరెడ్డి కుటుంబసభ్యులు వ్యవహరించారు. రామిశెట్టి హరనాథ్‌ ఉభయకర్తత్వంతో రాత్రి నిర్వహించిన కూచిపూడి భరతనాట్య ప్రదర్శన భక్తులను అలరించింది. కార్యక్రమాలను ఆలయ చైర్మన్‌ పాపారెడ్డి వెంకటసుబ్బారెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి రమణారెడ్డి పర్యవేక్షించారు. 
    నేడు షణ్ముఖస్వామి కల్యాణోత్సవం
    బ్రహ్మోత్సవాల్లో భాగంగా మల్లాంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం షణ్ముఖస్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement