సీసీ కెమెరాలతో నేరాలకు చెక్‌ | Sakshi
Sakshi News home page

సీసీ కెమెరాలతో నేరాలకు చెక్‌

Published Wed, Apr 19 2017 10:15 PM

సీసీ కెమెరాలతో నేరాలకు చెక్‌ - Sakshi

- వేలిముద్ర ఆధారంగా నేరస్తుల గుర్తింపు
- పోలీస్‌ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు
- రానున్న రోజుల్లో స్మార్ట్‌ పోలిసింగ్‌
- రాయల సీమ ఐజీ శ్రీధర్‌రావు
 
ఆదోని టౌన్‌: సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయవచ్చని రాయలసీమ రేంజ్‌ ఐజీ ఎన్‌. శ్రీధర్‌రావు తెలిపారు. ఆదోని పట్టణంలోని పోలీస్‌ కంట్రోల్‌రూం, వ¯న్‌Œ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లను బుధవారం.. ఎస్పీ ఆకే రవికృష్ణతోపాటు ఆయన తనిఖీ చేశారు. ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూంలో సీసీ కెమెరాల పనితీరును డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు వివరించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ. ఆదోని పట్టణంలో రూ.30 లక్షల వ్యయంతో 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు రక్షణ కల్పించేందుకు.. సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. రాయలసీమపరిధిలోని తిరుపతిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఫలితాన్నిస్తున్నాయన్నారు. చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలులోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
 
అధునాతన టెక్నాలజీతో థంబ్‌ (వేలిముద్ర) ఆధారంగా నేరస్తులను గుర్తించడం సులభం అవుతోందన్నారు. పోలీసు శాఖలో చాలా మార్పులు వచ్చాయని, సైబర్‌ నేరాలు, అసాంఘిక శక్తుల ఆట కట్టించడంతో పురోగతి సాధిస్తున్నామని చెప్పారు. పోలీసు శాఖలో 12 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అందులో ఆరు వేల పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మొబైల్‌ టెక్నాలజీతోనూ కేసులను ఛేదించనున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో స్మార్ట్‌ పోలిసింగ్‌ వ్యవస్థ వస్తుందన్నారు. ఆన్‌లైన్‌ మోసాలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. 
 
కంట్రోల్‌ రూం పోలీసులకు ప్రోత్సాహకాలు
ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూంలో పనిచేస్తున్న ఐదుగురు పోలీసులకు ఐజీ శ్రీధర్‌రావు, ఎస్పీ ఆకె రవికృష్ణలు.. ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేశారు. ఆదోని షరాఫ్‌ బజార్, బంగారం, వెండి వ్యాపారుల అసోసియేషన్‌ నిర్వాహకులు ఐజీ, ఎస్పీలను సన్మానించారు. డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు, సీఐలు ఘంటా సుబ్బారావు, చంద్రశేఖర్, దైవప్రసాద్, శంకరయ్య, గౌస్, ఎస్‌ఐలు ఈశ్వరయ్య, నల్లప్ప, సునిల్‌ కుమార్, బాబు, విజయ్, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement