చెక్‌పోస్టుల్లో 'అమరావతి' దందా | Sakshi
Sakshi News home page

చెక్‌పోస్టుల్లో 'అమరావతి' దందా

Published Sun, Feb 21 2016 10:03 AM

చెక్‌పోస్టుల్లో 'అమరావతి'  దందా - Sakshi

కొత్త రాజధాని పేరుతో బలవంతపు వసూళ్లు
జిల్లాలోని అన్ని చెక్‌పోస్టుల్లో ఇదే తంతు
అధికారికమా.. అనధికారికమా?

 
జిల్లాలోని చెక్‌పోస్టుల్లో పనిచేస్తున్న సిబ్బంది అక్రమ సంపాదన కోసం కొత్తఎత్తులు వేస్తున్నారు. నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి చందాల పేరిట పలు వాహనాల డ్రైవర్ల నుంచి డబ్బు దండుకొంటున్నారు. ఏపీలో కొత్త రాజధాని నిర్మాణానికి తాము చందాలను ఇవ్వడం ఏంటని డ్రైవర్లు నెత్తీ నోరు బాదుకుంటున్నారు.
 
పలమనేరు: జిల్లాలోని చెక్‌పోస్టులు అక్రమ దందాకు అడ్డాగా మారాయి. అక్కడి సిబ్బంది రాజధాని పేరుతో యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏదైనా అడ్డు చెబితే వాహన డ్రైవర్లకు చుక్క లు చూపిస్తున్నారు. జిల్లాలోని గుడిపాల సమీపంలో ఏసీబీ అధికారులు సోదాలకు రాగా తమిళనాడుకు చెందిన ఓ డ్రైవర్ ఈ విషయాన్ని స్వయంగా వారికే ఫిర్యాదు చేయండంతో సదరు అధికారులే ఆశ్చర్యపోయారు. దీనిపై ఆరాతీస్తే గత కొన్నాళ్లుగా జిల్లాలోని పలు చెక్‌పోస్టుల్లో ఈ అక్రమ దందా సాగుతున్నట్టు తేలింది. పలువురు లారీ డ్రైవర్లు తమ నుంచి కూడా రూ.100 నుంచి రూ.200 దాకా వసూలు చేసినట్టు తెలిపారు.
 
అన్నిశాఖల్లోనూ ఇదే తరహా అక్రమాలు..
జిల్లాలోని పలమనేరు సమీపంలో ఆర్‌టీవో, కమర్షియల్ టాక్స్, సివిల్ సప్లయిస్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, రెడ్‌శ్యాండిల్ చెక్‌పోస్టులున్నాయి. అదేవిధంగా గుడిపాల మండలంలో తమిళనాడు సరిహద్దుల్లో, అటు తిరుపతి సమీపంలో చెన్నై బార్డర్‌తో పాటు జిల్లాలోని పలు వ్యవసాయ మార్కెటింగ్, అటవీశాఖ చెక్‌పోస్టులలో ఈ అక్రమ వసూళ్లు సాగుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఎక్సైజ్ చెక్‌పోస్టుల్లోని సిబ్బంది రోజుకు రూ. పదివేల దాకా దోచుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి.
 
ఇప్పటికే ఆర్టీసీలో అమరావతి పేరిట అదనపు సెస్..
అమరావతి నిర్మాణం పేరిట ఓ వైపు ఆర్టీసీలో గుట్టుచప్పుడు కాకుండా టిక్కెట్టుపై రెండు రూపాయల అదనపు సెస్‌ను వసూలు చేస్తున్నా రు.అయితే ఇది అమరావతి నిర్మాణానికా? లేక బస్టాండుల్లో మౌలికసదుపాయాల కల్పనకా? అని ఆర్టీసీ అధికారులే చెప్పలేకపోతున్నారు. దీని కారణంగానూ ప్రయాణికులపై అదనపు భారం పడుతూ ఉంది.
 
ఇంతకు ముందు బడి పిల్లల నుంచి..
ఇలా ఉండగా గతంలో బడిపిల్లల నుంచి రాజధాని నిర్మాణానికి అంటూ రూ.10 చొప్పున చందాలను వసూలు చేసి హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వానికి మొట్టిక్కాయ పడిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ చెక్‌పోస్టులలోనూ ఇలా వసూళ్లు ఏంటనే విమర్శలు వస్తున్నాయి. దీని గురించి సంబంధిత శాఖలను అడిగితే తమకు ఏం తెలీదని సమాధానం దాట వేస్తున్నారు. కానీ ఎక్సైజ్ చెక్‌పోస్టులో మాత్రం భారీగా దోపిడీ సాగుతున్నట్టు సృష్టంగా తెలుస్తోంది. ఇక్కడి సిబ్బంది ఇలా డ్రైవర్ల నుంచి వసూలు చేసి జిల్లాస్థాయి అధికారులకు కూడా వాటాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారు లు నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.
 
 
 ఇదిగో సాక్ష్యం
యాదమరి: ‘‘ఆంధ్రలే తలైనగరం అమరావతి నిర్మిక్కునుం.. నరియా కాసు కుడుంగయ్యా.. అని ఎల్లా చెక్‌పోస్టు పోలీసు కారుంగు కేటినికీరాంగ్ సార్.. ఎన్న పన్ననం సోల్లుంగు’’ ఇదీ తమిళనాడుకు చెందిన ఓ లారీ డ్రైవర్ ఆవేదన. (ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తరాజధాని అమరావతిని నిర్మిస్తున్నారని.. అందుకోసం ప్రభుత్వం తమను డబ్బు వసూలు చేయమందంటూ.. చిత్తూరు జిల్లాలోని అన్ని చెక్‌పోస్టుల్లో సిబ్బంది వేధిస్తున్నారని, సొమ్ము ఇవ్వకుంటే వాహనాలు నిలిపివేస్తున్నారని ఓ తమిళనాడు లారీ డ్రైవర్ ఏసీబీ అధికారుల వద్ద వాపోయారు.)
 
 శనివారం ఏసీబీ అధికారులు చిత్తూరుజిల్లాలోని జోడిచింతల వద్ద ఉన్న చెక్‌పోస్టులో రికార్డులు తనిఖీ చేస్తుండగా తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ బాలకృష్ణ రాజమండ్రి నుంచి కేరళకు లోడ్డు తీసుకెళ్లుతూ చెక్‌పోస్టు వద్ద లారీని ఆపి సీలు వేసుకోవడానికి లోనికి వెళ్లాడు. ఈ సమయంలో  అక్కడ ఉన్న సిబ్బంది ఆగండి అక్కడ ఏసీబీ అధికారులు ఉన్నారు, వెళ్లిపోండి అని చెప్పడంతో ఆయన ఏసీబీ అధికారుల వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకున్నారు.

 
 

Advertisement
Advertisement