చిరుతను చూసి పరుగులు తీసిన భక్తులు | Sakshi
Sakshi News home page

చిరుతను చూసి పరుగులు తీసిన భక్తులు

Published Tue, Jul 5 2016 7:30 PM

Cheetah wandering in Tirumala

తిరుమల: తిరుమలలో చిరుతల సంచారం పెరిగింది. ఇప్పటివరకు రాత్రి వేళల్లో కనిపించే చిరుతలు ప్రస్తుతం పగలే కనిపిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం 5.20 గంటలకు జీఎన్‌సీకి సమీపంలోని తిరుపతికి వెళ్లే 56 వ మలుపు వద్ద ఓ చిరుత కాలిబాట దాటింది. దాన్ని చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. అది కాస్త రోడ్డుపైకి వచ్చింది. రోడ్డు దాటకుండా అటూ ఇటూ చూస్తూ ఉండిపోయింది.

అదే సమయంలో అటువైపు వచ్చిన ఆర్టీసీ బస్సు ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది. అదే సమయంలో వెళ్లిన ద్విచక్రవాహనదారులైన టీటీడీ ఉద్యోగులు కూడా ఆగిపోయారు. ఎక్కడ చిరుత దాడి చేస్తుందోనని వెనక్కు వెళ్లిపోయారు. తర్వాత ఆ చిరుత సాఫీగా అడవిలోకి వెళ్లిపోయిందని టీటీడీ ఉద్యోగి రత్నప్రభాకర్ తెలిపారు. తాము రాత్రి, పగలు అన్న తేడా లేకుండా ద్విచక్రవాహనంపై వెళుతుంటామని, తొలిసారి పగలు చిరుతను చూశామని తెలిపారు. ఇటీవల చిరుతల సంచారం పెరిగినా టీటీడీ వాటిని బంధించలేమని తేల్చి చెప్పటం గమనార్హం.

Advertisement
Advertisement