చెరువులు చకచకా | Sakshi
Sakshi News home page

చెరువులు చకచకా

Published Sat, Mar 4 2017 12:17 AM

చెరువులు చకచకా

 ఉండి : ఉండి నియోజకవర్గంలో చేపల చెరువుల అక్రమ తవ్వకాలు చకచకా సాగిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఆక్వా మాఫియా యథేచ్ఛగా చెరువులు తవ్వేస్తోంది. ఇదేమని అడుగుతున్న సరిహద్దు రైతులపై బెదిరింపులకు దిగుతోంది. మీకు దిక్కున్నచోట చెప్పుకోండంటూ చెలరేగిపోతోంది. కాలువ గట్లనూ చెరువుల్లో కలిపేసుకుంటున్నా అటు నీటి పారుదల, ఇటు రెవెన్యూ అధికారులు కిమ్మనడం లేదు. ఉండి మండలంలో 19 గ్రామాలు 
ఉండగా, 12 గ్రామాల్లో చెరువుల తవ్వకం విచ్చలవిడిగా సాగుతోంది. నియోజకవర్గంలోని 70 గ్రామాలు ఉండగా.. సుమారు 50 గ్రామాల్లో ఇదే తంతు సాగుతోంది. 
అనుమతులు అంతంతే..
అక్కడక్కడా కొందరు కొద్దోగొప్పో భూమిలో చెరువుల తవ్వకానికి అనుమతులు తెచ్చుకున్నా.. వాటి ముసుగులో వందలాది ఎకరాల్లో తవ్వకాలు సాగిస్తున్నారు. 5 నుంచి 10 ఎకరాలకు అనుమతి తీసుకుంటూ 25 నుంచి 50 ఎకరాల్లో చెరువులు తవ్వుతున్నారు. ఆక్వా మాఫియా ధాటికి తట్టుకోలేక చిన్న, సన్నకారు రైతులు తమకున్న కొద్దిపాటి భూమిని చెరువుల్లో కలిపేయాల్సి వస్తోంది. లేదంటే.. తమకున్న ఎకరం, అర ఎకరం భూమిని అయినకాడికి వారికి అమ్ముకోవాల్సి వస్తోంది. ఇటీవల కొందరు రైతులు చెరువుల తవ్వకాలను అడ్డుకుంటున్నారు. చెరువుల వల్ల సరిహద్దులో ఉన్న తమ భూములు చౌడుబారి పంటలకు పనికిరాకుండాపోతాయన్న ఆందోళనతో రోడ్డెక్కుతున్నారు. అలాంటి వారిపై ఆక్వా మాఫియా సామదాన దండోపాయాలు ప్రయోగిస్తోంది.
పేదోళ్లమని లెక్కచేయడం లేదు
మేం పేద కుటుంబానికి చెందిన వాళ్లం. మాకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఇప్పుడు అదికూడా మాకు మిగిలేలా లేదు. మా భూమిని ఆనుకుని చెరువులు తవ్వేస్తున్నారు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. అక్రమ చెరువులు తవ్వుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు. మేం చనిపోయాక మా శవాలను చూడటానికి వస్తారా?– చిట్టిపల్లె ముసలయ్య, రైతు, కొండగూడెం, పాములపర్రు
చెరువు తవ్వితే ఆత్మహత్యే శరణ్యం
ఎస్టీ కులానికి చెందిన మేం తాత ముత్తాతల కాలం నుంచి అర ఎకరం భూమిని సాగు చేసుకుంటూ బతుకుతున్నాం. మా భూమి సరిహద్దులో అక్రమంగా చెరువు తవ్వుతున్నారు. ఇదేంటని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. చెరువు తవ్వకాన్ని ఆపకపోతే ఆత్మహత్యే శరణ్యం.– పెదకాపు అన్నపూర్ణ, రైతు, కొండగూడెం, పాములపర్రు
దిక్కున్నచోట చెప్పుకోమంటున్నారు
మా చేను సరిహద్దులో చెరువు తవ్వుతేంటే ఇదేంటని అడిగాను. దిక్కున్నచోట చెప్పుకోమంటున్నారు. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశాను. పచ్చటి చేలను చెరువులుగా మార్చి సాధించేదేమిటని అడిగితే ఎవరూ వినడం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండా మా ప్రాంతంలో చెరువుల తవ్వుతున్నారు. అధికారులు సరైన చర్యలు తీసుకోకపోతే ఎంతవరకైనా వెళ్లి ఆపుతాను. రైతు విలువ ఏమిటో తెలియజేస్తాను.– గొట్టుముక్కల సత్యనారాయణరాజు, రైతు, కోలమూరు
 
కఠినంగా వ్యవహరిస్తున్నాం
కోలమూరు శివారులో అక్రమంగా చెరువులు తవ్వుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. 
వెంటనే చర్యలు తీసుకున్నాం. అనధికారికంగా చెరువులు తవ్వితే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడం. మండలంలో ఎక్కడైనా అనుమతులు లేకుండా చెరువులు తవ్వితే మాకు తెలియచేయండి. తక్షణ చర్యలు చేపడతాం.– వై.దుర్గాకిషోర్, తహసీల్దార్‌ 
 
 
 

Advertisement
Advertisement