ఛత్తీస్‌గఢ్ ‘విద్యుత్’ వెనక్కి! | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్ ‘విద్యుత్’ వెనక్కి!

Published Thu, Nov 19 2015 12:53 AM

ఛత్తీస్‌గఢ్ ‘విద్యుత్’ వెనక్కి! - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ తో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) వెనక్కిపంపింది. ప్రస్తుత రూపంలో ఆ ఒప్పందాన్ని ఆమోదించలేమని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతంగా కలిగించే విధంగా ఆ ఒప్పందంలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని రావాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆదేశించింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) వ్యవహారం మళ్లీ మొదటికి రానుంది.

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఒప్పందంలోని కీలక నియమ నిబంధనల్లో మార్పుచేర్పులు చేయడానికి చాలా కాలం పట్టే అవకాశముంది. అయితే సవరణలకు అంగీకరించాలా, వద్దా అనే అంశంపై దీనిపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు న్యాయ సలహా తీసుకుని, దానికి అనుగుణంగా వ్యవహరించనున్నాయి. దీంతో ప్రస్తుతానికి ఈ ఒప్పందం మరుగున పడినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సవరణలకు అంగీకరించకపోతే ఈ పీపీఏ పూర్తిగా పక్కన పడిపోయే అవకాశం ఉంది.

 అడ్డగోలు నిబంధనలు..
 ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఆ రాష్ట్ర డిస్కం (సీఎస్పీడీసీఎల్)తో తెలంగాణ డిస్కంలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దానిపై ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా... విద్యుత్ రంగ నిపుణులు, రాజకీయ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. సాంకేతికంగా ఈ ఒప్పందంలో దాదాపు 30 వరకు లోపాలున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా విద్యుత్ ధరలు నిర్ణయించుకోకుండానే ఒప్పందం కుదుర్చుకోవడం.. స్థిర, అస్థిర చార్జీల కు సంబంధించిన ప్రాథమిక అంచనాలు ఒప్పం దంలో లేకపోవడం పెద్ద లోపమని పిటిషనర్లు స్పష్టం చేశారు. మార్వా విద్యుత్ కేంద్రం పెట్టుబ డి వ్యయం, నిర్మాణ కాల వడ్డీ(ఐడీసీ)ల వివరాలు కూడా లేవని.. ఈ లోపాల మూలంగా భవి ష్యత్తులో ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ నిర్ణయించే ధరలను మన విద్యుత్ సంస్థలు చెల్లించక తప్పని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

 కొన్నా, కొనకున్నా చార్జీలు..!
 అదే విధంగా ఈ ఒప్పందంలో మరో ప్రధాన లోపం.. విద్యుత్ కొన్నా, కొనకున్నా ఛత్తీస్‌గఢ్‌కు ఏటా రూ. వందల కోట్ల స్థిర చార్జీలు చెల్లించాల్సిందే. అంటే ఒప్పందం మేరకు పూర్తిగా విద్యుత్ కొనుగోలు చేయకున్నా... 1000 మెగావాట్లకు సంబంధించిన స్థిర చార్జీలు వర్తిస్తాయి. ఆ విద్యుత్‌ను తీసుకోవాల్సిన అవసరం ఉండి, పూర్తిస్థాయిలో తీసుకునేలా కారిడార్ లభించకపోయినా చార్జీలు కట్టాల్సిందే. ఇక ఈ ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం ఎన్పీడీసీఎల్ 30 శాతం, ఎస్పీడీసీఎల్ 70 శాతం విద్యుత్ తీసుకుంటాయి. ఒకవేళ అవసరం లేని పక్షంలో ఏ డిస్కం అయినా పూర్తిగా విద్యుత్ కొనుగోలు చేయకున్నా ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఇక విద్యుత్ చార్జీల నిర్ణయాధికారాన్ని పూర్తిగా ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీకి అప్పగించారు. విద్యుత్ చార్జీల్లో ఒక శాతం కూడా ఉండని ట్రేడింగ్ మార్జిన్ నిర్ణయాధికారాన్ని మాత్రమే తెలంగాణ ఈఆర్సీ చేతిలో ఉంచారు. ఈ లోపాలే కాకుండా భవిష్యత్తులో ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ చార్జీల నియమ నిబంధనల్లో తీసుకొచ్చే మార్పులను సైతం అమలు చేసేందుకు తెలంగాణ డిస్కంలు గుడ్డిగా అంగీకరించాయి.
 
 బొగ్గుతోనూ దెబ్బ
 మార్వా థర్మల్ ప్లాంట్‌కు 140 కిలోమీటర్ల దూరంలోనే బొగ్గు గనిని కేటాయించగా... ఒప్పందంలో దాన్ని ప్రస్తావించకుండా ‘దేశీయ బొగ్గును వినియోగిస్తాం’ అనే పదంతో సరిపెట్టారు. దేశంలోని సుదూర ప్రాంతాల నుంచి బొగ్గు కొంటే ఆ చార్జీల భారం తెలంగాణ డిస్కంలపై పడుతుంది. సింగరేణి, కోల్ ఇండియాలు అధిక ధరలకు వేలం వేసే బొగ్గు సైతం దేశీయ బొగ్గు కేటగిరీ కిందికే రానుంది. మరోవైపు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం విధించే విద్యుత్ పన్నులను తెలంగాణ ప్రభుత్వం భరించాలని ఒప్పందంలో ఉంది. మొత్తంగా తెలంగాణ డిస్కంలు గుడ్డిగా ఒప్పుకున్న నిబంధనల ఫలితంగా ఛత్తీస్‌గఢ్ విద్యుత్ వ్యయం యూనిట్‌కు రూ.5 నుంచి రూ. 6 వరకు ఉండే అవకాశముంది. ఈ అభ్యంతరాలపై తెలంగాణ డిస్కంలు ఇచ్చిన సమాధానాల పట్ల ఈఆర్సీ సంతృప్తి చెందలేదు. లోపాలను సరిదిద్దాల్సిందేనని స్పష్టం చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement