వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి

Published Sat, Sep 9 2017 10:40 PM

వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి

ధర్మవరం టౌన్‌: ధర్మవరం ప్రభుత్వాస్పత్రి  వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నవజాత శిశువు మృత్యువుపాలైంది. పట్టణంలోని లోనికోటకు చెందిన హసీఫా శుక్రవారం ప్రభుత్వాస్పత్రిలో పండంటి మగబిడ్డను ప్రసవించింది. శిశువు ఉమ్మనీరు తాగడంతో అనారోగ్యానికి గురయ్యాడు. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో విషయాన్ని వైద్యులకు తెలిపారు. అయితే ఆ సమయంలో చిన్నపిల్లల డాక్టర్‌ వెంకటేశ్వర్లు అందుబాటులో లేరు. చేసేదిలేక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించుకుని తిరిగి ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. అప్పటికి చిన్నారి ఆరోగ్యం కుదుటపడినా శనివారం ఉదయం మళ్లీ క్షీణించింది. శ్వాస తీసుకోవడంలో మరోసారి ఇబ్బంది ఎదురవడంతో చిన్నారి తల్లిదండ్రులు డ్యూటీ డాక్టర్‌ వెంకటేశ్వర్లు కోసం చిన్నపిల్లల వార్డుకు వెళితే యథావిధిగా అందుబాటులో లేడు.

దీంతో వారు ఆ చిన్నారిని తిరిగి అదే ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందాడని వైద్యుడు చెప్పడంతో రోదిస్తూ ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆలస్యంగా వచ్చిన చిన్నపిల్లల డాక్టర్‌ వెంకటేశ్వర్లు నిర్లక్ష్యంతోనే తమ పిల్లాడు మృతి చెందాడని వాగ్వాదానికి దిగారు. వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఆస్పత్రికి వచ్చిన వారి ప్రాణాలు తీస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. వివాదం ముదరడంతో పట్టణ ఎస్సై జయానాయక్‌ అక్కడికి చేరుకుని బాధితులను శాంతపరిచారు. జరిగిన విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా.. సూపరింటెండెంట్‌ రామలక్ష్మి చిన్నపిల్లల డాక్టర్‌ సెలవులో ఉండటంతోనే బయట చికిత్స చేయించుకున్నారని వివరణ ఇచ్చారు. చిన్న పిల్లల డాక్టర్‌ వెంకటేశ్వర్లు  మాత్రం తాను డ్యూటీలో ఉన్నానని, తన వద్దకు ఎవరూ రాలేదంటూ పొంతన లేని సమాధానం చెప్పారు.

Advertisement
Advertisement