ఛిద్రమవుతున్న బాల్యం | Sakshi
Sakshi News home page

ఛిద్రమవుతున్న బాల్యం

Published Sun, Jun 11 2017 11:49 PM

ఛిద్రమవుతున్న బాల్యం

– పేదరికమే కారణమంటున్న స్వచ్ఛంద సంస్థలు
సందర్భం ః నేడు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం

పేదరికం, నిరక్షరాశ్యత, నిర్ధేశక కట్టుబాట్ల మధ్య బాల్యం ఛిద్రమవుతోంది. అమ్మానాన్నల ఒడిలో హాయిగా ఆడుకోవాల్సిన వయసులో సంపాదన చట్రంలో చిక్కుకుపోతోంది. అనేక కారణాలతో వేల సంఖ్యలో బాలలు కార్మికులుగా మగ్గిపోతున్నారు. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేలా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రతి ఏటా జూన్‌ 12న బాల కార్మిక వ్యతిరేక దినం నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే బాలకార్మిక వ్యవస్థ రూపుమాపేందుకు రెండు దశాబ్దాల క్రితమే రూపొందించిన చట్టాలు.. ఆచరణలో విఫలం కావడంతో ఈ వ్యవస్థ ఇంకా కొనసాగుతూనే ఉంది.
- అనంతపురం కల్చరల్‌

14 ఏళ్ల లోపు బాలబాలికలను పనిలో పెట్టుకుంటే నేరమని చట్టాలు చెబుతున్నాయి. పూట గడవని పరిస్థితుల్లో చాలా చోట్ల తల్లిదండ్రులే తమ పిల్లలను కార్మికులుగా పనిలోకి పంపుతున్నారు. చిరు షాప్‌లు మొదలుకుని వెల్డింగ్‌, మోటార్‌ మెకానిక్‌, బేల్దారి పనుల్లోనూ 14 ఏళ్లలోపు పిల్లలు అత్యధికంగా కనిపిస్తున్నారు. కరువు జిల్లాలో పేదరికం నిర్మూలనలో ప్రభుత్వాలు విఫలం కావడం వల్లనే నేటికీ బాలకార్మిక వ్యవస్థ కొనసాగేందుకు కారణంగా పలువురు పేర్కొంటున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 76 మంది బాల కార్మికులను విముక్తి చేసినట్లు గొప్పలు పోతున్న కార్మికశాఖ అధికారులు.. ఫిర్యాదులు అందితే తప్ప తామేమీ చేయలేమంటూ చేతులేత్తేస్తున్నారు. కంటి ముందే బాలలు కార్మికులుగా కనిపిస్తున్నా.. పట్టించుకోకపోవడంతో ఈ వ్యవస్థకు అంతు లేకుండా పోతోంది.

ప్రభుత్వ విధానాలే కారణమా?
2010లో మాత్రమే జిల్లాలో ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసి శిక్ష పడేలా చేసినట్లు అధికారులు పేర్కొంటున్నా.. తర్వాత దాదాపు ఈ తరహా కేసు రాస్ర్టంలో నమోదు చేయకపోవడం గమనార్హం. ప్రభుత్వ పథకాలు తమకు చేరడం లేదని, అందువల్లే తమ పిల్లలను సంపాదించుకుని వచ్చేందుకు తామే పంపుతున్నట్లు నిరుపేద తల్లిదండ్రులు చెబుతుంటే తామేమీ చేయలేకపోతున్నామంటూ అధికారులు స్పష్టంగా పేర్కొంటున్నారు. అంటే పేదల సంక్షేమానికి తిలోదకాలివ్వడం ద్వారా పరోక్షంగా బాల కార్మిక వ్యవస్థ కొనసాగేందుకు ప్రభుత్వాలే కారణమయ్యాయి?!

సమాచారమందిస్తే చర్యలు తీసుకుంటాం
జిల్లాలో ఎంతమంది బాల కార్మికులున్నారో తెలుసుకోవడం కష్టం. అయితే మా దృష్టికి వచ్చిన ప్రతి కేసునూ పరిశీలిస్తున్నాం. ప్రతి బుధవారం చైల్డ్‌ లేబర్‌ డే నిర్వహిస్తున్నాం. 1098 చైల్డ్‌ లేబర్‌ నంబర్‌కు కాల్‌ చేసి ఎవరు సమాచారం అందించినా తక్షణ చర్యలు తీసుకుంటాం.  సాధారణంగా బాలకార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తే యజమానులకు మూడేళ్ల శిక్ష, రూ.100 జరిమానా విధిస్తారు.  శిక్షలు అల్పంగా ఉన్నప్పుడు బాల కార్మిక వ్యవస్థ ఒక్కసారిగా మారిపోతుందనుకోను.
– రాణి,  కార్మిక శాఖ, జిల్లా ఉప కమిషనర్‌

పేదరికాన్ని నిర్మూలించాలి
కరువు జిల్లాలో తినడానికే కష్టమై వలసలు పోతున్న తరుణంలో పిల్లలను కార్మికులుగా మార్చొద్దంటే వినరు. ప్రభుత్వమే ప్రతి ఇంట్లో పేదరికాన్ని దూరం చేసే చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా తాము తిన్నా తినకపోయినా బిడ్డలు చదువుకోవాలని ఆశించాలి.
 – సద్దాం హుస్సేన్, రెయిన్‌బో సంస్థ, అనంతపురం

Advertisement

తప్పక చదవండి

Advertisement