చినబాబు పచ్చజెండా! | Sakshi
Sakshi News home page

చినబాబు పచ్చజెండా!

Published Wed, Nov 9 2016 12:10 AM

అక్రమ మైనింగ్‌ జరిగిన ప్రాంతం - Sakshi

అక్రమ మైనింగ్‌ షురూ!
– మెల్లమెల్లగా ప్రారంభించిన తెలుగు తమ్ముళ్లు
– రాత్రి సమయాల్లో జేసీబీతో తవ్వకాలు
– చినబాబు కనుసన్నల్లోనే వ్యవహారం
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో అక్రమ మైనింగ్‌ మళ్లీ ప్రారంభమైంది. మెల్లమెల్లగా అధికార పార్టీ నేతలు ఈ దందాకు తెరతీశారు. అనుమానం రాకుండా రాత్రి సమయాల్లో జేసీబీతో తవ్వకాలు చేపడుతున్నారు. పగలు మాత్రం కిమ్మనకుండా ఉంటున్నారు. కర్నూలుకు కూత వేటు దూరంలో ఉన్న వెల్దుర్తి మండలంలో జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారం అధికార పార్టీకి చెందిన చిన్నబాబు కనుసన్నల్లో సాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటికే అక్రమ ఇసుక వ్యాపారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. తోడుగా అక్రమ మైనింగ్‌ను కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. రాత్రికి రాత్రే జేసీబీలతో అక్రమంగా మైనింగ్‌ తవ్వకాలు చేపడుతున్నప్పటికీ అటువైపుగా కన్నెత్తి చూసేందుకు మైనింగ్, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు సాహసించని పరిస్థితి. ఈ మేరకు చిన్నబాబు నుంచి సీరియస్‌గా ఆదేశాలు ఉండటంతో ఏమీ చేయలేకపోతున్నామని ఆయా శాఖల అధికారులు వాపోతున్నారు. 
 
గతంలో ఇచ్చిన మాట ప్రకారమే..
వాస్తవానికి ఆరు నెలల క్రితం జరిగిన సమావేశంలో మైనింగ్‌ మూతపడిన విషయాన్ని సదరు చిన్నబాబు దృష్టికి అధికార పార్టీ కార్యకర్తలు తీసుకెళ్లారు. మైనింగ్‌ జరిగితే తమకు ఆదాయ వనరుగా మారుతుందని.. అందువల్ల అక్రమ మైనింగ్‌ ప్రారంభించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే అక్రమ మైనింగ్‌ను మెల్లమెల్లగా ప్రారంభించుకోవాలని.. ఇందుకు సరైన సమయంలో గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తానని హామీ ఇచ్చినట్టు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఆ మేరకు తాజాగా చిన్నబాబు కాస్తా ఆమోదముద్ర వేయగానే తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. అక్రమ మైనింగ్‌ జరుగుతున్నప్పటికీ పట్టించుకోవద్దని ఇటు మైనింగ్‌ అధికారులతో పాటు అటు రెవెన్యూ, పోలీసులకు కూడా సదరు చిన్నబాబు నుంచి గట్టిగా ఆదేశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
 
మూతపడిన చెక్‌పోస్టు
జిల్లాలో అధికంగా మైనింగ్‌ నిల్వలు వెల్దుర్తి మండలంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్రమ మైనింగ్‌ కూడా గతంలో జోరుగా సాగేది. పంట పొలాలతో పాటు వక్ఫ్‌బోర్డు, దేవాదాయశాఖ భూముల్లోనూ అనుమతులు లేకుండా  గతంలో అక్రమంగా తవ్వకాలను చేపట్టారు. అయితే, దీనిపై అనేక ఆరోపణలు రావడంతో అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌శాఖల ఆధ్వర్యంలో రామళ్లకోటకు సమీపంలో చెక్‌పోస్టును కూడా ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు ఈ చెక్‌పోస్టు వద్ద కాపలా ఉంచారు. దీంతో అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్టపడింది. అయితే, తిరిగి తాజాగా అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తమకు ఆదాయం లేకుండా పోతోందని అధికార పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి వచ్చిన డిమాండ్‌తో అధికారుల నోళ్లు మూయించి అక్రమ మైనింగ్‌కు తెరలేపారు. దీంతో చెక్‌పోస్టు వద్ద కూడా ఎలాంటి కాపలా లేకుండా నిరుపయోగంగా మార్చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద ఇప్పటికే అక్రమ ఇసుకతో ఆదాయాన్ని ఆర్జిస్తున్న తెలుగు తమ్ముళ్లు.. మైనింగ్‌ ఆదాయం కూడా తోడు చేసుకోవడం గమనార్హం.

Advertisement
Advertisement