అంతర్మథనంలో ఆమంచి | Sakshi
Sakshi News home page

అంతర్మథనంలో ఆమంచి

Published Thu, Jul 27 2017 1:25 AM

అంతర్మథనంలో ఆమంచి - Sakshi

అధికార పార్టీపై చీరాల ఎమ్మెల్యే ఆగ్రహం
పార్టీలో చేర్చుకొని ప్రాధాన్యత తగ్గించారంటూ అసంతృప్తి
తలనొప్పిగా తయారైన పోతుల, పాలేటి
సునీతకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడంపై కినుక
ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఆమంచి
పార్టీ సమావేశాలకూ దూరం.. దూరం
వంచించారంటూ టీడీపీ అధినేతపై గుర్రు


ఒంగోలు : చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అంతర్మథనంలో పడ్డారా..? అధికార పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నారా..? జరుగుతున్న పరిణామాలను, టీడీడీ నేతల మధ్య జరుగుతున్న చర్చను పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. పార్టీలో చేర్చుకునేటప్పుడు ‘అధికారాలన్నీ నీకే..’ అంటూ చెప్పిన ముఖ్యమంత్రి ఏరు దాటాక బోడి మల్లన్న సామెతలా Ðవ్యవహరించారని ఆమంచి ఆవేదనలో ఉన్నట్లు సొంతపార్టీ వర్గాలే పేర్కొంటుండటం గమనార్హం. టీడీపీలో చేరి తొందరపడ్డానా.. అని ఆత్మపరిశీలన చేసుకుంటున్న ఆమంచి ప్రస్తుతం ఎటూ తేల్చుకోలేని సందిగ్ధ స్థితిలో ఉన్నట్లు ప్రచారం ఉంది.

గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా గెలిచి ఆమంచి కృష్ణమోహన్‌ చీరాలలో తన పట్టు చాటారు. ఆ తర్వాత టీడీపీ  అధికారంలోకి రావడంతో, ఆమంచిపై ఓడిపోయిన పోతుల సునీత అధిపత్యం చెలాయించే పరిస్థితి తలెత్తింది. ఆమెకు అడ్డుకట్ట వేసేందుకు ఆమంచి పావులు కదిపారు. ఇదే సమయంలో అధికార పార్టీ సైతం ఫిరాయింపులను ప్రోత్సహించటంతో ఇదే అదునుగా ఆమంచి టీడీపీలో చేరారు. అధికారంతోపాటు పాటు తన ప్రత్యర్థి సునీతకు అడ్డుకట్ట వేయవచ్చని ఆయన భావించారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అన్ని అధికారాలు తనకే అప్పగిస్తామని చేరిక సమయంలో ముఖ్యమంత్రి సైతం ఆమంచికి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. టీడీపీ పాత, కొత్త నేతల మధ్య ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఎమ్మెల్యేలకే నియోజకవర్గ అధికారాలంటూ ముఖ్యమంత్రి సైతం ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన అధిపత్యానికి ఎదురుండదని ఆమంచి భావించారు.

ఇచ్చిన మాటపై నిలబడడన్న పేరున్న చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరించారు. రెండు గుర్రాల స్వారీకి దిగారు. ఆమంచిపై అనుమానంతో అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఓడిపోయిన సునీతను సైతం ప్రోత్సహించారు. ఊహించని రీతిలో ఆమెకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఆమంచి దూకుడుకు అడ్డుకట్ట వేసే సంకేతాలు పంపారు. దీంతో ఎమ్మెల్సీ సునీత ఎమ్మెల్యే ఆమంచికి అడుగడుగునా అడ్డుపడ్డారు. అధిపత్యం చాటేందుకు అమీతుమీకి సిద్ధమయ్యారు.

సునీత ఎదురుదాడి..
చీరాల నియోజకవర్గంలో జన్మభూమి–మా ఊరు, జనచైతన్యయాత్రలు, సంక్షేమ అభివృద్ధి పథకాల్లో ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి ప్రకటించినా జిల్లాలోని అద్దంకితో పాటు చీరాలలోనూ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ప్రతి దాంట్లోనూ పోతుల సునీత వేలు పెట్టడం మొదలుపెట్టారు. జన్మభూమి–మా ఊరుతో పాటు, జనచైతన్య యాత్రలు సైతం పోటీగా నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో వాటాల కోసం పట్టుపట్టారు. ఏకంగా ముఖ్యమంత్రి వద్దే పనులు చక్కబెట్టుకోవడం మొదలుపెట్టారు. అంతెందుకు టీడీపీ మండల కమిటీలు సైతం ఆమంచితో పోటీ పడి సొంతంగా వేయడం సునీత ఎదురుదాడి అని చెప్పకనే చెప్పింది. అధిష్టానం అండదండలతో పాటు బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమితులైన మంత్రి పరిటాల సునీత అండతో పోతుల సునీత ఆధిపత్యం చలాయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

తలనొప్పిగా మారిన పాలేటి..
ఇదే సమయంలో ఆమంచికి వ్యతిరేక వర్గంగా ఉన్న మాజీ మంత్రి పాలేటి రామారావు సైతం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు ఇటీవల జరిగిన అక్కాయిపాలెం ఎత్తిపోతల పథకం సాగునీటి అధ్యక్ష ఎన్నికల్లోనూ అటు పాలేటి రామారావు, ఆమంచి వర్గాలు పోటీ పడ్డాయి. ఈ ఎన్నికల్లో పాలేటి రామారావు అనుచరుడు పోటీలో నెగ్గారు. పాలేటి సైతం మూడో వర్గంగా మారి బూత్‌లెవల్‌ కమిటీ సమావేశాలు సైతం నిర్వహిస్తుండటం గమనార్హం. ఒక వైపు పోతుల సునీత, మరొక వైపు పాలేటి రామారావులు సైతం తనతో పోటీ కార్యక్రమాలు నిర్వహించటం, అన్ని విషయాల్లో పోటీ పడుతుండటం ఆమంచికి తలనొప్పిగానే కాదు అవమానకరంగా మారింది. నియోజకవర్గంలో నిన్న, మొన్నటి వరకు ఏకచక్రాధిపత్యంగా వెలిగిన ఆమంచి ఇప్పుడు స్వపక్షంలోనే అడుగడుగునా పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. పైపెచ్చు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా.... అధిపత్యం చాటే పరిస్థితి లేదు. ఈ విషయం నియోజకవర్గవ్యాప్తంగా కాదు జిల్లా స్థాయిలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.

దీంతో ఆమంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని అధికారాలు నీవేనని మాటిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట తప్పారని ఆమంచి ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. నమ్మించి నట్టేట ముంచారని అధికారపార్టీలో చేరి అణిగిమణిగి ఉండాల్సి వస్తుందని ఆయన వేదన చెందుతున్నట్లు సమాచారం. ఇటీవల జిల్లాలో జరుగుతున్న టీడీపీ సమావేశాలకు సైతం ఆమంచి మొక్కుబడిగా హాజరవుతున్నారు. జిల్లా కేంద్రంలో జరిగిన మినీ మహానాడు సమావేశానికి హాజరైన ఆమంచి మొక్కుబడిగా కొద్దిసేపు సమావేశంలో ఉండి వెళ్లిపోయారు. ప్రసంగించేందుకు పిలిచినా ఆయన స్పందించలేదు. తాజాగా కనిగిరిలో జరిగిన జిల్లా సమన్వయ సమావేశానికి సైతం ఆమంచి హాజరుకాలేదు. ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఆమంచి అధికార పార్టీలో కొట్టుమిట్టాడుతున్నట్లు ప్రచారం ఉంది. ఆయన అదును కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అనుచరవర్గం చెబుతోంది. 

Advertisement
Advertisement