ఎంసెట్-౩లో మెరిసిన నగరం | Sakshi
Sakshi News home page

ఎంసెట్-౩లో మెరిసిన నగరం

Published Thu, Sep 15 2016 11:39 PM

హారికకు స్వీట్లు తినిపిస్తున్న కుటుంబసభ్యులు

సాక్షి, సిటీబ్యూరో: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకుగాను ఇటీవల నిర్వహంచిన తెలంగాణ ఎంసెట్‌–3లో నగర విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. టాప్‌–10లో ఐదు ర్యాంకులు సాధించి ఔరా అనిపించారు. ఎంసెట్‌–2లో మాదిరిగానే ర్యాంకులు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరంతా ఎంసెట్‌–2లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు కాకపోవడం గమనార్హం. నగరం 20,648 మంది విద్యార్థులకు ఎంసెట్‌–3కి దరఖాస్తు చేసుకోగా 15,371 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
 
ఇందులో 15,195 మంది (98.85 శాతం) అర్హత సాధించారు. లాలాగూడ సాయినగర్‌కు చెందిన పి. శ్రీ హారిక 151 మార్కులతో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. బహదూర్‌పురకు చెందిన జీషాన్‌ హమీద్‌ జలీలి నాలుగో ర్యాంకు దక్కించుకున్నాడు. ఇతను టీఎస్‌ ఎంసెట్‌–1లో రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే.  మెహిదీపట్నం అరబ్‌ లేన్‌కు చెందిన ఇక్రంఖాన్‌ 5వ ర్యాంకు, భారతీ నగర్‌ కాలనీ వాసి శ్రీకాంతేశ్వర్‌ రెడ్డి 6వ ర్యాంకు, బేగంపేటకు చెందిన బలుసు కావ్య 9వ ర్యాంకు సాధించారు. వీరితోపాటు వందలోపు 40 ర్యాంకులు నగర వాసులే దక్కించుకోవడం విశేషం. 

కేటగిరీల వారీగా..
బీసీ–ఏ కేటగిరీలో సరూర్‌నగర్‌ చెరుకుతోట కాలనీకి చెందిన బి. శివాని 148 మార్కులతో 52 ర్యాంకు సాధించి ఈ కేటగిరీలో రెండో స్థానంలో నిలిచింది. రామంతపూర్‌ గణేష్‌ నగర్‌కు చెందిన అభితేజ్‌ 53వ ర్యాకు,  అశోక్‌ నగర్‌ వాసి కొయ్య వినీత్‌ రెడ్డి 91వ ర్యాంకు సాధించారు. బీసీ–బి కేటగిరీలో ఈసామియా బజార్‌కు చెందిన కుందారం వైష్ణవి 42వ ర్యాంకు, మీర్‌పేట సర్వోదయ నగర్‌కు చెందిన తాళ్లపల్లి రవితేజకు 43వ ర్యాంకు దక్కించుకున్నారు.
 
బీసీ–సి కేటగిరీలో జీడిమెట్లకు చెందిన సర్హా సుహితకు 37వ ర్యాంకు లభించింది. బీసీ–డి కేటగిరీలోనూ ఉత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. నల్లకుంట పద్మా కాలనీకి చెందిన రాజబోయిన వెంకటేష్‌కు 39, కూకట్‌పల్లి బాలాజీ నగర్‌ వాసి డి. శ్రీ వరుణ్‌కు 45వ ర్యాంకు దక్కింది.   

Advertisement
Advertisement