చిన్నారి జ్ఞానసాయికి చికిత్స ప్రారంభం | Sakshi
Sakshi News home page

చిన్నారి జ్ఞానసాయికి చికిత్స ప్రారంభం

Published Mon, Jun 27 2016 7:21 PM

CM assures assistance for Gnana Sai's  treatment

చెన్నై: పుట్టుకతో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిట్టితల్లి జ్ఞానసాయికి చెన్నై గ్లోబల్ హెల్త్ సిటీలో వైద్య చికిత్స అందిస్తున్నారు. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ మహ్మద్ రేల పర్యవేక్షణలో వైద్య బృందం పరీక్షల్ని వేగవంతం చేసింది. 20 రోజుల్లోపు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు తగిన చర్యలు తీసుకోనున్నారు.

చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం వేపూరి కోట పంచాయతీ బత్తలాపురం రైల్వేస్టేషన్ ప్రాంతానికి చెందిన రమణప్ప, సరస్వతి దంపతుల ఎనిమిది నెలల కుమార్తె జ్ఞానసాయి కాలేయ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు తగిన స్థోమత లేకపోవడంతో కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని రమణప్ప కోర్టును ఆశ్రయించారు. వ్యవహారం మీడియాలో రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు తగ్గ చర్యలు తీసుకోవాలని గ్లోబల్ ఆసుపత్రి చైర్మన్ రవీంద్రనాథ్‌కు సూచించడంతో, చిన్నారిని చెన్నైకు తరలించారు.

సోమవారం జ్ఞానసాయిని రమణప్ప, సరస్వతి దంపతులు పెరుంబాక్కంలోని గ్లోబల్ హెల్త్ సిటీకి తీసికెళ్లారు. వారి వెంట ములకలచెరువు ఎంపీపీ ఆషాబీ ఉన్నారు. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ మహ్మద్ రేల పర్యవేక్షణలో కాలేయ సంబంధిత వ్యాధుల నిపుణుడు డాక్టర్ నరేష్ షణ్ముగం బృందం వైద్య పరీక్షలు వేగవంతం చేసింది. దీనిపై ఆ హెల్త్‌సిటీ ఉపాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి, తమ చైర్మన్ రవీంద్రనాథ్ ఆదేశాలతో జ్ఞానసాయికి వైద్య పరీక్షలు వేగవంతం చేశామన్నారు. చిన్నారి చలాకీగా ఉన్న దష్ట్యా, ఔట్ పేషెంట్‌గా పరిగణించి చికిత్సలు అందించేందుకు నిర్ణయించామని వివరించారు. స్క్రీనింగ్, ఇతర పరీక్షలు సాగుతున్నాయన్నారు.

కాలేయం దానానికి సంబంధించి, ఆ చిన్నారి తల్లిదండ్రులకు పరీక్షల జరపనున్నామని, వారి కాలేయం సరిపడే అవకాశాలు ఎక్కువే అని పేర్కొన్నారు. ఈ ప్రక్రియకు వారం పది రోజులు సమయం పట్టే అవకాశం ఉందని, తదుపరి అనుమతులకు మరో ఐదు రోజులు పట్టవచ్చన్నారు. 20 రోజుల్లోపు చిన్నారికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరుగుతుందని స్పష్టం చేశారు. సంక్లిష్ట పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చిన చిన్న పిల్లలకు డాక్టర్ రేల శస్త్ర చికిత్సలను విజయవంతం చేశారని, జ్ఞానసాయి సంపూర్ణ ఆరోగ్యంతో ఇక్కడి నుంచి వెళ్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చిన్నారి తండ్రి రమణప్ప మాట్లాడుతూ జ్ఞానసాయిని సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా అప్పగించాలని వైద్యులకు విన్నవించామన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement