మందుబాబులకు చంద్రబాబు సంచలన సలహా! | Sakshi
Sakshi News home page

మందుబాబులకు చంద్రబాబు సంచలన సలహా!

Published Sun, Jun 5 2016 12:44 PM

మందుబాబులకు చంద్రబాబు సంచలన సలహా! - Sakshi

విజయవాడ: ఆయన కోడి కంటే ముందే మేల్కొంటారు. యోగా, ధ్యానం, స్నానం పూర్తిచేసి ఆరింటికల్లా ప్రభుత్వ అధికారుల గుండెల్లో నిద్రకు ఉపక్రమిస్తాంటారు. తిరిగి లేచేది రాత్రి 11 గంటలకు. నాలుగు దశాబ్ధాల తన 'రాజకీయ' ఫిట్ నెస్ కు క్రమశిక్షణ మొదటి కారణమైతే మద్యపానానికి దూరంగా ఉండటం రెండో కారణమని గతంలో పలుమార్లు పేర్కొన్నారు కూడా. ఆయన బాబుగారు. అందుకే ఇప్పుడు మాట మార్చారు. మద్యం సేవిస్తే మనుషులు సంతోషంగా ఉంటారని చెబుతున్నారు. మంతుకొట్టి పేకాట ఆడితే ఆ మజాయే వేరంటున్నారు. మందు ముట్టనని చెప్పుకునే చంద్రబాబు మద్యపానంలోని మజాను పూసగుచ్చినట్లు చెప్పడం.. అది కూడా డ్వాక్రామహిళల సమక్షంలో మాట్లాడటంతో ముఖ్యమంత్రిపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.
 
నవనిర్మాణ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాల మహిళలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి పూట ఓ పెగ్గు మద్యం తాగితే సంతోషంగా ఉంటారని, ఇంకా సంతోషంగా ఉండాలంటే పేకాట ఆడాలని మగవారికి సలహా ఇచ్చారు. తాగమన్నంత మాత్రాన పూటుగా తాగి భార్యాపిల్లలను కొట్టొద్దని హితవు పలికారు. మొత్తానికి 'మందు తాగండి బాబులూ..' అనే అర్థంలో ప్రభుత్వ ఆదాయాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేశారు. (చదవండి:  తాగుడు మాన్పిస్తే జనం పిచ్చివాళ్లవుతారు- చంద్రబాబు)
 
సమావేశానికి హాజరైన మహిళలు.. మందుపై ముఖ్యమంత్రి చెప్పిన మాటలు విని అవాక్కయ్యారు. అసలే మద్యం బానిసలు పెరిగిపోతుండగా, దానిని అరికట్టాల్సిందిపోయి సీఎం స్థాయిలో ఇలా బహిరంగంగా మద్యపానాన్ని ప్రోత్సహించేలా మాట్లాడటం దారుణమని గుసగుసలాడుకున్నారు. బాబు వ్యాఖ్యలపై పలు మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మద్యపానాన్ని సమర్థిస్తూ శనివారం కూడ చంద్రబాబు వింత వ్యాఖ్యలు చేశారు. మద్యనిషేధం విధిస్తే జనం పిచ్చివాళ్లవుతారని వ్యాఖ్యానించారు. 24 గంటలు తిరిగిలోపే మళ్లీ మందుపై మరో మాట పేల్చారాయన. 

Advertisement
Advertisement