‘గీతో’పదేశం! | Sakshi
Sakshi News home page

‘గీతో’పదేశం!

Published Tue, Jun 28 2016 11:40 PM

‘గీతో’పదేశం! - Sakshi

జిల్లాల విభజనపై టీఆర్‌ఎస్ ప్రతినిధులతో నేడు సీఎం భేటీ
సమావేశంలో కొత్త జిల్లాలపై సంకేతాలు ఇచ్చే అవకాశం
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపై వీడనున్న చిక్కుముడి

 జిల్లా విభజన రేఖ ఎలా ఉంటుందో మరికొన్ని గంటల్లో స్పష్టం కానుంది. ప్రతిపాదిత కొత్త జిల్లాలపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మదిలో ఏముందో తేలనుంది. జిల్లాల పునర్విభజనే ప్రధాన ఎజెండాగా బుధవారం టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రతిపాదిత జిల్లాల ముసాయిదాలపై అధికారపార్టీ ప్రజాప్రతినిధులతో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాలు కొత్త జిల్లాలుగా ఏర్పడనున్నాయి? ఏవి జిల్లా కేంద్రాలు కానున్నాయి? ఏ నియోజకవర్గాలు పక్క జిల్లాల్లో విలీన మవుతున్నాయనే అంశాలపై సీఎం కేసీఆర్ సంకేతాలిచ్చే  అవకాశం ఉంది.

 నయా జిల్లాలపై ఇప్పటికే సరిహద్దులు, మ్యాపులు తయారు చేసి.. ఇప్పుడు తమ అభిప్రాయం తెలుసుకోవడం లాంఛనప్రాయమేననే భావన అధికారపార్టీలో వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులను కూడా సంప్రదించిన తర్వాతే కొత్త జిల్లాలకు తుదిరూపు ఇచ్చామనే సందేశం ప్రజల్లోకి వెళ్లడమే ఈ సమావేశం ముఖ్యోద్దేశమని పార్టీ వర్గాలు అంటున్నాయి.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి మినహా ఇతర జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టతనిచ్చింది. వీటిలో చాలావరకు కొత్త కలెక్టరేట్లపై కసరత్తు కూడా పూర్తి చేసింది. చివరి దశకు చేరిన విభజన ప్రక్రియలో ఉద్యోగుల సర్దుబాటుపై అక్కడి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

జంట జిల్లాల్లో అనిశ్చితి
మన జిల్లా విషయానికి వస్తే విభజనపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా కొనసాగించాలనే అంశం మాత్రమే కొలిక్కి వచ్చింది. ఈ జిల్లా పరిధిలో ప్రతిపాదించిన వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాలు మినహా ఇతర నియోజకవర్గాలు (10) ఏ జిల్లాలోకి వెళతాయి? ఎన్ని భాగాలుగా విడిపోతాయి? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల విభజన విషయానికొచ్చేసరికి సీఎం ప్రత్యేక ఆసక్తి  కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాల పునర్విభజనపై జరిగిన రెండు అత్యున్నతస్థాయి సమావేశాల్లో ప్రభుత్వం ఈ జంట జిల్లాలను ఎలా విభజించాలనే అంశంపై ఎటూ తేల్చలేకపోయింది.

ఈ నేపథ్యంలో తాజాగా జరిగే భేటీలో జిల్లా భవితవ్యాన్ని సీఎం నిర్దేశించనున్నారు. ఇదిలావుండగా, జిల్లాల డీలిమిటేషన్‌పై శాసనసభాపక్ష సమావేశంలో జిల్లా ఎమ్మెల్యే /ఎమ్మెల్సీ అభిప్రాయాలను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకునే అవకాశ ముంది. అంతేకాకుండా జిల్లాల పునర్విభజనపై విపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా తిప్పకొట్టేలా జిల్లాల ఖరారులో పాటిస్తున్న శాస్త్రీయత, వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలను కూడా విశదీక రించే వీలుంది.

అయితే, నయా జిల్లాలపై ఇప్పటికే సరిహద్దులు, మ్యాపులు తయారు చేసి.. ఇప్పుడు తమ అభిప్రాయం తెలుసుకోవడం లాంఛనప్రాయమేననే భావన అధికారపార్టీలో వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులను కూడా సంప్రదించిన తర్వాతే కొత్త జిల్లాలకు తుదిరూపు ఇచ్చామనే సందేశం ప్రజల్లోకి వెళ్లడమే ఈ సమావేశం ముఖ్యోద్దేశమని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఏదీఏమైనా సమావేశంలో ముఖ్యమంత్రి వెల్లడించే సంకేతాల ఆధారంగా జిల్లాల విభజనపై మరికొంత స్పష్టత రానుంది.

Advertisement
Advertisement