’పుంజు’కుంటున్నాయ్‌ | Sakshi
Sakshi News home page

’పుంజు’కుంటున్నాయ్‌

Published Wed, Jan 4 2017 10:05 PM

’పుంజు’కుంటున్నాయ్‌ - Sakshi

కోడి పందేలకు చెక్‌ పెడతారా.. సలాం చేస్తారా!
 హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తామంటున్న యంత్రాంగం
 సుప్రీం నుంచి స్టే ఉత్తర్వుల కోసం జిల్లా నేతల యత్నాలు
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
సంప్రదాయం ముసుగులో కోడి పందేలు నిర్వహించేందుకు పందెం రాయుళ్లు సకల ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. కోడి పందేలు వేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే తీసుకు వచ్చేందుకు కొందరు నేతలు సుప్రీం కోర్టును ఇప్పటికే ఆశ్రయించారు. ఎట్టిపరిస్థితుల్లో పందేలు జరగనిచ్చేది లేదని అధికారులు చెబుతున్నా.. పందేల రాయుళ్లు మాత్రం వీటిని తాటాకు చప్పుళ్లుగానే భావిస్తూ తమ పని తాము చేసుకుపోతున్నారు. తమిళనాడులో జల్లికట్టుకు అనుమతి లేకపోయినా అక్కడ ఆ పోటీలు నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కోర్టు ఆదేశాల పేరుతో సంప్రదాయాలను అడ్డుకోవడం సరికాదని వాదిస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుని సుప్రీం కోర్టులో పిటీషన్‌ వేశారు. మరో రెండు రోజుల్లో దీనిపై ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు నుంచి స్టే వస్తుందన్న ఆశతో పందేల నిర్వాహకులు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
తోటల మాటున..
పందేల బరుల నిమిత్తం కొబ్బరి, మామిడి, జీడిమామిడి, ఆయిల్‌పామ్‌ తోటలను శుభ్రం చేస్తున్నారు. జనం రాకపోకలు సాగించేందుకు వీలుగా దారులు వేస్తున్నారు. పెద్దఎత్తున వచ్చే వాహనాల కోసం పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. బరుల కోసం ఎంపిక చేసిన ప్రాంతాలను చదును చేసి నీటితో తడపటం.. రోలర్లతో తొక్కించడం వంటి పనులను ముమ్మరం చేశారు. 
 
సమాచారం ఉన్నా.. బైండోవర్‌ చేసినా..
జిల్లాలో కోడిపందేలు వేయించే వారు ఎవరు, ఎక్కడ వేస్తారు.. కోళ్లు ఎక్కడ పెంచుతున్నారు.. వాటికి శిక్షణ ఎక్కడ ఇస్తున్నారు.. కోడి పుంజుల కాళ్లకు కత్తులు ఎవరు కడతారనే పూర్తి సమాచారం పోలీసుల వద్ద ఉంది. అయితే, ప్రజాప్రతినిధులకు అడుగులకు మడుగులొత్తుతున్న అధికారులు పందేలు వేయకుండా వారిని ఎంతమేరకు నిలువరిస్తారు, ఎవరిపై బైండోవర్‌ కేసులు పెడతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే బైండోవర్లు చేయడం మొదలైనా.. కీలక సూత్రధారులు, పాత్రధారుల వైపు పోలీసులు తొంగి చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఒక ప్రజాప్రతినిధి తన ఇలాకాలో గత వారమే కోడిపందేలు ట్రైల్‌ వేసినట్టు  సమాచారం. గత ఏడాది, అంతకు ముందు ఏడాది కూడా కోడి పందేలను అడ్డుకుంటామని చెప్పినా చివరకు ఎమ్మెల్యేల ఒత్తిడి, ప్రభుత్వం నుంచి అందిన అనధికార ఆదేశాలతో సంక్రాంతి రోజుల్లో పందేలపై ఆంక్షలు ఎత్తివేశారు. దాంతో పండగ వేళ పందేల మాటున రూ.వందల కోట్లు చేతులు మారాయి. హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తామని ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ చెబుతున్నా..  క్షేత్రస్థాయిలో పోలీసు సిబ్బంది సహకారం ఎలా ఉంటుంది, అదేశాలను అమలు చేస్తారా అన్నది వచ్చే వారంలో తేలిపోనుంది. ఇదిలావుంటే.. హైకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. మండల స్థాయిలో ఏర్పాటు చేసే జాయింట్‌ యాక‌్షన్‌ కమిటీల్లో పని చేసే స్వచ్ఛంద సేవా సంస్థలు, జంతు పరిరక్షణ సమితుల ప్రతినిధుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఈ బృందాలు 7వ తేదీ నుంచి 24 వరకూ పనిచేస్తాయని అధికారులు ప్రకటించారు. చివరకు ఏమవుతుందనేది.. చివరి వరకు వేచి చూడాల్సిందే.
 

Advertisement
Advertisement