‘కోడ్‌ ఆఫ్‌ డిసిప్లేన్ సవరించాల్సిందే... | Sakshi
Sakshi News home page

‘కోడ్‌ ఆఫ్‌ డిసిప్లేన్ సవరించాల్సిందే...

Published Sat, Dec 31 2016 11:00 PM

‘కోడ్‌ ఆఫ్‌ డిసిప్లేన్ సవరించాల్సిందే... - Sakshi

► నేడు హైదరాబాద్‌లో సీఎల్‌సీ వద్ద సమావేశం

గోదావరిఖని : సింగరేణిలో అమలవుతున్న కోడ్‌ ఆఫ్‌ డిసిప్లీన్ లో మార్పులు తప్పనిసరిగా చేయాలని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. గత నవంబర్‌ 26న డెప్యూటీ సీఎల్‌సీ శ్రీ వాస్తవ సమక్షంలో తొలి సమావేశం జరగగా శనివారం హైదరాబాద్‌లో సెంట్రల్‌ లేబర్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్‌నాయక్‌ సమక్షంలో ద్వితీయ సమావేశం జరగనుంది. దేశంలో 1968లో సిమ్లాలో జరిగిన జాతీయ కార్మిక సంఘాల సమావేశంలో కోడ్‌ ఆఫ్‌ డిసీప్లీన్ ను రూపొందించారు. దాని ప్రకారం ఏ ప్రభుత్వ రంగ సంస్థలోనైనా రెండేళ్ల కాలపరిమితికే ఎన్నికలు నిర్వహిస్తారు. ఏ యూనియన్  అయినా గేట్‌ మీటింగ్‌లు, కార్మికుల నుంచి సభ్యత్వం సేకరించే వీలు కల్పించారు. ఆయా కంపెనీల్లో జరిగిన ఎన్నికల్లో 15 శాతం ఓట్లు సాధించిన కార్మిక సంఘానికి యాజమాన్యంతో రిప్రజెంట్‌ చేసే అవకాశం ఉంటుంది. సింగరేణిలో మాత్రం 1998లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగిన తర్వాత గెలిచిన సంఘంతో సంప్రదించకుండా యాజమాన్యం కోడ్‌ ఆఫ్‌ డిసిప్లీన్ ను తయారుచేసి అమలులోకి తీసుకువచ్చింది.

దీని ప్రకారం గెలుపొందిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలే గనులు, ఓసీపీలు, డిపార్ట్‌మెంట్లపై గేట్‌మీటింగ్‌లు నిర్వహించాలని, గెలిచిన సంఘాలే కార్మికుల వద్ద నుంచి వార్షిక సభ్యత్వాన్ని సేకరించాలని, ఏ ఒప్పందం జరిగినా గుర్తింపు సంఘంతోనే చేయాలని తదితర నిర్ణయాలను కోడ్‌ ఆఫ్‌ డిసిప్లీన్లో పొందుపర్చారు. దీనివల్ల ఓడిపోయిన ఇతర కార్మిక సంఘాలకు ఇబ్బందికరంగా మారింది. ఓడిపోయిన లేక ఇతర డివిజన్లలో ప్రాతినిధ్య సంఘాలుగా గెలిచిన చాలా కార్మిక సంఘాలకు గనులపైకి వచ్చిన ప్రతీసారి యాజమాన్యం నుంచి పరాభవమే ఎదురైంది. గేట్లు మూసివేసి వెళ్లగొట్టిన సంఘటనలు, గేట్‌మీటింగ్‌లను వీడియోలు, ఫొటోలు తీస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. కార్మికుల వేతనాలు, ఇతర సౌకర్యాలు, అలవెన్స్ లకు సంబంధించి జేబీసీసీఐ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను కార్మికులకు చెప్పడానికి, ఆ నిర్ణయాలను సింగరేణిలో అమలు చేయించేలా చర్చించడానికి జాతీయ కార్మిక సంఘాలకు వీలులేకుండా పోయింది. దీంతో కోడ్‌ఆఫ్‌ డిసిప్లీన్ లో మార్పులు చేయాలని సెంట్రల్‌ లేబర్‌ కమిషనర్‌కు జాతీయ సంఘాలు మొరపెట్టుకున్నాయి.

సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి పూర్తి కావడం, ఎన్నికలకు సంబంధించి అధికారిని నియమించకపోవడంతో ఆయాకార్మిక సంఘాలు కోడ్‌ ఆఫ్‌ డిసీప్లీన్ లో మార్పులు చేయాలని పట్టుబడుతున్నాయి. గుర్తింపు సంఘం ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం లేకపోలేదు.  ఎన్నికలపై ఎంపీ కవిత కేంద్ర కార్మిక శాఖపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఎన్నికల గురించి కార్మిక సంఘాలతో  సెంట్రల్‌ లేబర్‌ కమిషనర్‌ చర్చించే అవకాశం ఉంది.

Advertisement
Advertisement