అభివృద్ధి లక్ష్యాలను సమగ్రంగా సాధించాలి | Sakshi
Sakshi News home page

అభివృద్ధి లక్ష్యాలను సమగ్రంగా సాధించాలి

Published Sun, Jan 22 2017 12:20 AM

అభివృద్ధి లక్ష్యాలను సమగ్రంగా సాధించాలి - Sakshi

- అభివృద్ధి లక్ష్యాలను సమగ్రంగా సాధించాలి
- దిశ చైర్మన్, ఎంపీ మురళీమోహన్‌
కాకినాడ సిటీ: కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు కల్పిస్తున్న నిధులను సమర్థవంతంగా వినియోగించి అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని దిశ కమిటీ చైర్మన్, పార్లమెంట్‌ సభ్యుడు ఎం.మురళీమోహన్‌  ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ విధాన గౌతమి సమావేశ హాలులో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షక కమిటీ (దిశ) సమావేశం కమిటీ చైర్మన్, రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్‌ అధ్యక్షతన జరిగింది. 17 శాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాలు, ప్రణాళికల పురోగతిని కమిటీ విస్తృతంగా సమీక్షించి ఆయా అంశాలు మరింత పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులకు సూచనలు జారీ చేసింది. సమావేశంలో తొలుత గ్రామీణ నీటి సరఫరాపై జరిగిన చర్చలో జిల్లాలో దశాబ్దాల క్రితం నిర్మించిన తాగునీటి పథకాల పైపులైన్ల స్థానంలో కొత్తవాటిని చేపట్టాలని, పెరిగిన జనాభా, ఆవాసాలకు అనుగుణంగా ఓవర్‌హెడ్‌ ట్యాంకులు ప్రతిపాదించాలని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కోరారు. విద్యాశాఖ సమీక్షలో మధ్యాహ్న భోజన పథకం కింద పోషక విలువలు లేని చిన్న గుడ్లు సరఫరా అవుతున్నాయని, 50 నుంచి 60 గ్రాములు ఉండే నాణ్యమైన గుడ్లు సరఫరా జరిగేలా చూడాలని రాజహహేంద్రవరం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పంతం రజనీ శేషసాయి కోరారు. నిధుల కేటాయింపున్నా పాఠశాల వంట షెడ్ల నిర్మాణాలు జరగకపోవడం పట్ల ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కొన్ని పనులు తనకు అప్పగిస్తే కేటాయించిన నిధులతోనే షెడ్లు కట్టి చూపిస్తానన్నారు. 
విపక్షాల గళం...
పాఠశాలలో స్వీపర్లను నియమిచారు కాని గడిచిన మూడు నెలల జీతాల చెల్లింపులు లేవని, దీంతో వారు పనిచేయడం మానివేశారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.రూరల్‌ హెల్త్‌ మిషన్‌ పరంగా గ్రామాల్లో చేపడుతున్న శానిటేషన్‌పై పర్యవేక్షణ కొరవడిందని ఎమ్మెల్యే చిర్ల పేర్కొన్నారు. ఏజెన్సీ పరిధిలో ఆరోగ్యపరంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కోరారు. ముంపు మండలాల్లో అంబులెన్స్‌ అందుబాటులో ఉంచాలన్నారు. వ్యవసాయ శాఖ సమీక్షలో వ్యవసాయ యాంత్రీకరణ కింద గిరిజన రైతులకు పవర్‌ టిల్లర్లకు బదులు పెద్ద ట్రాక్టర్లు సరఫరా చేయాలని సూచించారు. పంచాయతీ శాఖ సమీక్షలో పన్నుల రిజవిజన్‌ పై ప్రజల్లో సరైన అవగాహన కల్పించడంలోను, కార్పొరేట్‌ కళాశాలల నుంచి పన్నులు వసూలు చేయడంలోను అధికారుల వైఫల్యాన్ని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యకం చేశారు. విద్యుత్తు శాఖ సమీక్షలో ప్రజా ప్రతినిధులకు సరైన సమాచారం అందించడంలో ఆ శాఖాధికారులు వైఫల్యంపై ఎంపీ తోట నరసింహం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ నామన రాంబాబు, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, జ్యోతుల నెహ్రూ, పులవర్తి నారాయణమూర్తి, జాయింట్‌ కలెక్టర్‌–2 జె.రాధాకృష్ణమూర్తి, డీఆర్‌డీఏ పీడీ ఎస్‌.మల్లిబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 
80 శాతం సభ్యులు గైర్హాజర్‌...
 కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పథకాలపై సమగ్ర చర్చ జరిగే సమావేశానికి సుమారు 80 శాతం మంది సభ్యులు గైర్హాజరయ్యారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేషన్‌ మేయర్లు సభ్యులుగా ఉంటారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిపి పది మందే హాజరయ్యరు. ఇతర ప్రజాప్రతినిధుల హాజరు కూడా అంతంత మాత్రంగా ఉండడంతో కుర్చీలన్నీ ఖాళీగానే దర్శనమిచ్చాయి. పది గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం 11.45 గంటలకు ప్రారంభమయింది. సుమారు 45 నిమిషాలపాటు సభ్యుల రాక కోసం కమిటీ చైర్మన్‌ వేచి ఉన్నారు.

Advertisement
Advertisement