కలెక్టర్‌ ఆగ్రహం | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ ఆగ్రహం

Published Fri, Sep 2 2016 10:40 PM

కలెక్టర్‌ ఆగ్రహం

–నిర్లక్ష్యం వహిస్తే విధుల నుంచి తప్పించండి
– బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా మార్చాలి
–కలెక్టర్‌ యోగితారాణా
డిచ్‌పల్లి : నిజామాబాద్‌ను బహిరంగ మల విసర్జన (ఓడీఎఫ్‌) లేని జిల్లాగా తీర్చిదిద్దడానికి రూ. 60 కోట్ల నిధులు మంజూరు చేసినా ఫలితం రావడం లేదని సంబంధిత అధికారులపై కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం డిచ్‌పల్లి ట్రైజం ట్రైనింగ్‌ సెంటర్‌లో జిల్లాలోని ఓడీఎఫ్‌కు సంబంధించిన అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ వారి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం కోసం ప్రజలు తమవంతుగా రూ. 900 చెల్లించేలా అవగాహన కల్పించి నిర్మాణాలు చేపట్టేలా కృషి చేయాలన్నారు. ఐకేపీ సభ్యులు మరుగుదొడ్లు నిర్మించుకుని వాడిన వారికి శిక్షణ ఇప్పించి ఆర్మూర్, నిజామాబాద్‌ రూరల్, బాల్కొండ, బాన్సువాడ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ప్రజలకు స్వచ్ఛభారత్‌ కార్యక్రమం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. అయినా సంబంధిత అధికారులు మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టడంలో అశ్రద్ధ వహించడం శోచనీయమని కలెక్టర్‌ యోగితారాణా అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణీత సమయంలో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని, అందుకు రాత్రి బసలు నిర్వహించైనా లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్‌ సూచించారు. రాష్ట్రంలో బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా 32 శాతంతో నిజామాబాద్‌ జిల్లా చివరగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. 8 నెలలుగా పనులు చేయాలని చెప్పినా అధికారులలో చలనం లేకపోవడం సరైన  పద్ధతి కాదని హెచ్చరించారు. ఓడీఎఫ్‌గా జిల్లాలో బీర్కూర్, నందిపేట్, వేల్పూర్‌లలో నిర్మిచిన మరుగుదొడ్లు చాలా బాగున్నాయన్నారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు సహకరించని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను విధుల నుంచి తప్పించాలని జెడ్పీ సీఈవోకు సూచించారు. స్వచ్ఛభారత్‌ రాష్ట్ర సంచాలకులు రామ్మోహన్‌రావు మాట్లాడుతూ జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి ఎలాంటి కష్టం లేదని, శ్రద్ధ, ఏకాగ్రత ఉన్నట్లయితే కాని పని ఉండదని తెలిపారు. సమావేశంలో ఆర్డీవోలు యాదిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, నగేశ్, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, ఎంపీడీవోలు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, ఏపీవోలు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement