Sakshi News home page

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Published Fri, Jul 14 2017 11:06 PM

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

ప్రహరీ గేటు కూలి విద్యార్థి దుర్మరణం
రక్షించబోయిన మహిళకూ గాయాలు


గుంతకల్లు : ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది. ప్రహరీ గేటు కూలడంతో నర్సరీ విద్యార్థి దుర్మరణం చెందాడు. విద్యార్థిని కాపాడబోయిన మహిళ కాలుపై గేటుపడటంతో ఆమె కూడా గాయపడింది. గుంతకల్లులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం దేగులపాడుకు చెందిన ఎం.తిమ్మయ్య, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. తిమ్మయ్య సోదరుడు ఓబుళయ్య గుంతకల్లు పట్టణంలోని వాల్మీకి సర్కిల్‌లో రవీంద్ర ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ నిర్వహిస్తున్నాడు.

తమ్ముడు నిర్వహిస్తున్న ఈ స్కూల్‌లోనే తిమ్మయ్య తన కుమారుడు రవి (4)ని ఈ విద్యా సంవత్సరం ఆరంభంలోనే నర్సరీలో చేర్పించాడు. రోజూలాగానే తన పినతండ్రి ఓబుళయ్యతో కలిసి రవి స్కూల్‌కు వచ్చాడు. విరామ సమయంలో రవి పాఠశాల ప్రహరీ గేట్‌ పట్టుకొని ఊయల ఆట ఆడుకుంటున్నాడు. వారం కిందట ట్రాక్టర్‌ ఢీకొనడం వల్ల గేటు దిమ్మె నెర్రెలిచ్చింది. దీనిని మరమ్మతులు చేయకుండా అలానే వదిలేశారు. రవి గేటును పట్టుకుని ఆడుకుంటుండగా ఉన్నపళంగా దిమ్మె విరిగి మీదపడింది.

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాలుడిని రక్షించేందుకని సమీపంలో దుస్తులు ఉతుకుతున్న హేమావతి అనే మహిళ అక్కడకు వచ్చింది. దిమ్మను పైకి ఎత్తబోయింది. అయితే అది బరువుగా ఉండటంతో సాధ్యం కాలేదు. అలా కొద్దిగా పైకెత్తిన దిమ్మె కాస్తా ఆమెపైనే పడటంతో కుడికాలు నుజ్జునుజ్జయ్యింది. పాఠశాల కరస్పాండెంట్, పినతండ్రి ఓబుళయ్య, పినతల్లి కవితలు వచ్చి చూసేసరికి రవి చనిపోయాడు. రూరల్‌ ఎస్‌ఐ బాబ్జాన్‌ సిబ్బందితో ప్రమాదస్థలికి చేరుకుని, బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలుడి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement
Advertisement