హోదా మోసంపై నిరసన జ్వాలలు | Sakshi
Sakshi News home page

హోదా మోసంపై నిరసన జ్వాలలు

Published Sat, Oct 24 2015 2:01 AM

హోదా మోసంపై నిరసన జ్వాలలు - Sakshi

♦ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
♦ వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు
 
 సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై శంకుస్థాపన రోజున ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేయనందుకు నిరసనగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ర్ట ప్రజలను నిట్టనిలువునా మోసగించారంటూ వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలు జరిగాయి. మానవహారాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేశాయి. ఆయా పార్టీల ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టులు చేశారు.

 ఎక్కడికక్కడ నిరసనలు: విశాఖలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు అరగుండు గీయించుకుని నిరసన తెలిపారు. మాడుగుల, పాడేరుల్లో ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయుడు, గిడ్డి ఈశ్వరిలు నిరసనలు చేపట్టారు.  విజయనగరం జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి తహశీల్దార్ కార్యాలయాల వద్ద నిరసనలు వ్యక్తం చేసి, తహశీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.  పలు నియోజకవర్గాల్లో సీపీఐ, సీసీఎం నాయకులు రాస్తారోకోలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో మానవహారం, ర్యాలీ, ధర్నాలు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లాలో  శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జగ్గంపేట మెయిన్ రోడ్ నుంచి పంచాయతీ కార్యాలయం వరకు  ర్యాలీ చేశారు.

రాజమండ్రిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు స్థానిక జాంపేట గాంధీ బొమ్మ సెంటర్‌లో చెవిలో పూలతో నిరసన తెలిపారు. ఏలేశ్వరంలో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, తునిలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రంపచోడవరంలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆధ్వర్యంలో మోదీ, చంద్రబాబుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. రాజమండ్రిలో కాంగ్రెస్ నేతృత్వంలో ర్యాలీ జరిగింది. పశ్చిమ గోదావరిలో వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు    ఆందోళనలు చే శాయి. పాలకొల్లులో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు నాయకత్వంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు.

గుంటూరు జిల్లాలో   వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్యర్యంలో కార్యకర్తలు నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని నిరసన చేపట్టారు. ఒంగోలులో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో  నిరసన ప్రదర్శన నిర్వహించారు. గిద్దలూరులో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఖాలీ మట్టి కుండలతో నల్లర్యాలీ నిర్వహించారు. నెల్లూరులో  కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీ జరిపారు.

విజయవాడలో వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి ఆధ్వర్యంలో ఒక కార్యకర్తకు బురద స్నానం చేయించారు. అనంతపురం జిల్లా  కదిరి, రాయదుర్గం, తాడిపత్రి, కళ్యాణదుర్గం, మడకశిర, పుట్టపర్తి, శింగనమల, పెనుకొండ, గుంతకల్లు, ఉరవకొండ, హిందూపురం నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.  వైఎస్సార్ జిల్లాలోని  పులివెందులలో పార్టీ నేతలు నల్ల రిబ్బన్లు ధరించి మోకాళ్లపై కూర్చొని నిరసన తెలియజేశారు. బద్వేలులో ఎమ్మెల్యే జయరాములు గాంధీ విగ్రహం వద్ద ఒంటి కాలిపై నిరసన తెలిపారు.

రాజంపేటలో  ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ బొమ్మకు వినతిపత్రం సమర్పించగా, కడపలో కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరసనలో ఎమ్మెల్యే అంజలాద్‌బాష, మేయర్ సురేష్‌బాబులు పాల్గొన్నారు. కర్నూలులో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు.  చిత్తూరు జిల్లాలో ైఎమ్మెల్యేలు అమరనాథ్‌రెడ్డి, డాక్టర్ సునీల్‌కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement