గందరగోళంగా పల్స్ సర్వే | Sakshi
Sakshi News home page

గందరగోళంగా పల్స్ సర్వే

Published Sat, Jul 16 2016 7:15 PM

గందరగోళంగా పల్స్ సర్వే - Sakshi

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వే (ప్రజాసాధికారిక సర్వే) గందరగోళంగా మారింది. యాప్ డౌన్‌లోడ్‌కాక, సర్వర్ పనిచేయక సర్వే నత్తనడకన సాగుతోంది. అసలు సర్వే ఎందుకుచేస్తున్నారో ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన లేదు. సర్వే సందర్భంగా అడుగుతున్న అంశాలను బట్టి పథకాల్లో కోత విధించేందుకే అని చాలామంది భావిస్తున్నారు.
 
చాలాచోట్ల డౌన్‌లోడ్ కాని యాప్
► నత్తనడకన సాగుతున్న సర్వే
► పనులు మానుకొని ఇళ్ల వద్ద ఎదురుచూస్తున్న ప్రజలు
► పథకాల్లో కోత విధిస్తారని ప్రచారం


చేజర్ల : ప్రజాసాధికారిక సర్వేను ప్రభుత్వం ఈనెల ఈ నెల 8వతేదీన ప్రారంభించింది. ఎన్యూమరేటర్లు ప్రజలకు సంబంధించి పలు అంశాల సమాచారాన్ని ఒకేచోట పొందుపర్చడమే దీని ప్రధాన లక్ష్యం. బ్యాంకు లావాదేవీలు, గృహోకపరణాలైన టీవీ, ఫ్రిజ్, గ్యాస్, సొంతిల్లు, గ్యాస్ సబ్సిడీ, విద్యార్హత వివరాలు ఇలా వివిధ రకాల సమాచారాన్ని  సర్వేలో సేకరిస్తారు. దీనికోసం జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున యంత్రాగాన్ని ఏర్పాటుచేసింది. 47 మంది ఇన్‌చార్జ్ అధికారులు, 51 మంది మాస్టర్ ట్రైనర్లు, 176 మంది సూపర్‌వైజర్లు, 1,487 మంది ఎన్యూమరేటర్లు 1,487 మంది అసిస్టెంట్లు సర్వే చేసేందుకు నియమించబడ్డారు.

ప్రారంభించిన తొలిరోజు నుంచే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో  సర్వేకు అంతరాయం ఏర్పడుతోంది. యాప్ డౌన్‌లోడ్ కాక సిబ్బంది ఎంతో ఇబ్బందిపడ్డారు. మొదట 2.1 సాఫ్ట్‌వేర్ వర్షన్ డౌన్‌లోడ్ చేయగా అది పనిచేయకపోవడంతో తర్వాత 2.2, 2.3, 2.3.1 ప్రస్తుతం. 2.4.1 వర్షన్‌లో ప్రయత్నిస్తున్నా యాప్ డౌన్‌లోడ్ కావడం లేదు. ఒక్కో వ్యక్తిని సర్వేచేసేందుకు ఎన్యూమరేటర్లకు ఇచ్చేది కేవలం రూ.2 మాత్రమే. దీంతో వారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
 
ఎందుకో..?
 సర్వే ఎందుకోసం..? ప్రజలందరిలో మెదులుతున్న ప్రశ్న ఇది. సమాచారాన్ని సేకరించడమని చెబుతున్నా ఇందులో మర్మం దాగుందని రాజకీయపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే సర్వేసాగుతోంది. బైక్ ఉందా? లేదా? ఆదాయం ఎంత? ఎవరెవరు ఉద్యోగం చేస్తున్నారు? ఇలా పలు వివరాలు సేకరిస్తుండటంతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పథకాల్లో కోత విధించేందుకే సర్వే అనే ప్రచారం ఉంది.
 పనిపోయే..
 గ్రామాల్లో సర్వే పేదలను ఇబ్బందిపెడుతోంది. క్షేత్రస్థాయి సిబ్బంది ఈ రోజు ఫలానా ఊరికి వస్తాం.. అందుబాటులో ఉండండని ప్రజలకు చెబుతున్నారు. అయితే సాంకేతిక సమస్య కారణంగా ఒక్కో ఇంట్లోనే గంటలకొద్ది సమయం పడుతుండటంతో ఎక్కువమందిని సర్వే చేయలేకపోతున్నారు. దీంతో కూలి పనులకు వెళ్తేగానీ పూటగడవని పరిస్థితి దారుణంగా ఉంది. రెండు రోజుల క్రితం ఓ మండలంలోని గ్రామంలో సర్వే ప్రారంభించగా ఒక్క ఇంటి వివరాలు సేకరించేందుకే మధ్యాహ్నమైంది. దీంతో పక్కరోజు సర్వే చేస్తామని అధికారులు చెప్పగా మీవల్ల పనులు పోయాయని కొంతమంది అసంతృప్తి వ్యక్తంచేశారు.  

 మెరుగైన సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి తెస్తున్నాం
 స్మార్ట్‌పల్స్ సర్వే విషయంలో తలెత్తిన సాంకేతిక సమస్యను రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మరో రెండు రోజుల్లో ఎటువంటి ఆటంకాలు లేని మెరుగైన సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి తెస్తాం. సమస్యను పరిష్కరిస్తాం.  -ఇంతియాజ్ అహ్మద్, జాయింట్ కలెక్టర్
 

Advertisement

తప్పక చదవండి

Advertisement