కానిస్టేబుల్‌ రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

Published Fri, Jul 29 2016 11:38 PM

Constable written test arrangements

సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈనెల 31 (ఆదివారం) నిర్వహించనున్న ట్రాన్స్‌పోర్ట్‌ కానిస్టేబుల్, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పరీక్షలకు అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.  మాల్‌ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు ముగిసేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది కృషి చేయాలని పరీక్షల జిల్లా ఇన్‌చార్జి, టీఎస్‌పీఎస్‌సీ సభ్యుడు సి.విఠల్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన పరీక్షల కో–ఆర్గనైజింగ్‌ అధికారులు, లైజన్, అసిస్టెంట్‌ లైజన్, చీఫ్‌ సూపరింటెండెంట్‌లతో సమావేశమయ్యారు.

హైదరాబాద్‌ జిల్లాలో 24,820 మంది పరీక్షలు రాయనున్నారని, ఇందు కోసం 42 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం ఉన్నందును సెల్‌ ఫోన్లు, ట్యాబుల్, వాచీలు, బ్లూటూత్‌ పరికరాలు, కాలిక్యులేటర్లను పరీక్షా కేంద్రాలకు అనుమతించకూడదని విఠల్‌ సూచించారు. ఎలక్ట్రానిక్‌ వస్తువులే కాకుండా నగలు, షూలు ధరించి అభ్యర్థులెవ్వరూ పరీక్ష కేంద్రాలకు రాకూడదని ఆయన సూచించారు. టీఎస్‌పీఎస్‌సీ అదనపు కార్యదర్శి శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ..

లైజన్‌ అధికారులు జూలై 31న ఉదయం 6.30కి టీఎస్‌పీఎస్‌సీ కేంద్రంలో రిపోర్టు చేయాలన్నారు. అసిస్టెంట్‌ లైజన్‌ ఆఫీసర్లు ఉదయం 7 గంటలకు పరీక్షా కేంద్రానికి రావాలన్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు  జరుగుతుందన్నారు.   సమావేశంలో ఇన్‌చార్జి ఏజేసీ అశోక్‌కుమార్, ఆర్డీఓలు  నిఖిల, రఘురాంశర్మ, టీఎస్‌పీఎస్‌సీ డిప్యూటీ సెక్రటరీ సీతాదేవి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement