చాకిరి చేయలేం! | Sakshi
Sakshi News home page

చాకిరి చేయలేం!

Published Mon, Jan 9 2017 10:34 PM

అధికారులతో వాగ్వాదం చేస్తున్న హెల్త్‌ సూపర్‌వైజర్లు

– స్వాస్త్య విద్యావాహిని పేరుతో ఉదయం నుంచి రాత్రి వరకు పని
–తమ వల్ల కాదని హెల్త్‌ సూపర్‌వైజర్లు ఆవేదన
కర్నూలు(హాస్పిటల్‌): స్వాస్త్య విద్యావాహిని పేరుతో  ఉదయం 7 గంటల నుంచి రాత్రి వరకు తమతో చాకిరి చేయించుకుంటున్నారని, అది తమకు పెనుభారమైందని పలువురు హెల్త్‌ సూపర్‌వైజర్లు తీవ్రంగా మండిపడ్డారు. స్వాస్త్య విద్యావాహిని కార్యక్రమంపై సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్‌)లో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే పలువురు హెల్త్‌ సూపర్‌వైజర్లు కార్యక్రమం నిర్వహణపై మండిపడ్డారు. ఉదయం 7 గంటలకు విధులకు వచ్చి రాత్రి 8 గంటలకు ఇంటికి వెళ్లాల్సి వస్తోందన్నారు. కళాశాల విద్యార్థులను తామే దగ్గరుండి ఎంపిక చేసిన గ్రామాలకు తీసుకెళ్తున్నామన్నారు. దీనికితోడు తాము పనిచేసే పీహెచ్‌సీ గాకుండా ఇతర పీహెచ్‌సీలకు విధులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా పీహెచ్‌సీల పరిధిలో సర్పంచులు తమకు సహకరించడం లేదన్నారు. తాము వెళ్లే విషయం స్థానిక పంచాయతీ కార్యదర్శులకు సమాచారాన్ని అధికారులు ఇవ్వకపోవడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నట్లు తెలిపారు.  ఏ పీహెచ్‌సీ సూపర్‌వైజర్లను ఆ ప్రాథమికహెల్త్‌సెంటర్‌ పరిధిలోనే స్వాస్త్య విద్యావాహిని కార్యక్రమం నిర్వహణకు పంపించాలని కోరారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిస్తామని పీఓడీటీ, ప్రోగ్రామ్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ సరస్వతీదేవి చెప్పారు. సమావేశంలో డీఐఓ డాక్టర్‌ వెంకటరమణ, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ (ఎయిడ్స్‌ అండ్‌ లెప్రసీ) డాక్టర్‌ రూపశ్రీ, ఎంపీహెచ్‌ఈఓలు, ఎంపీహెచ్‌ఎస్‌లు, హెల్త్‌ ఎడ్యుకేటర్లు, పీహెచ్‌ఎన్‌లు పాల్గొన్నారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement