తెలుగు మీడియం కొనసాగించాలి | Sakshi
Sakshi News home page

తెలుగు మీడియం కొనసాగించాలి

Published Thu, Aug 3 2017 7:16 PM

continue to telugu medium

అనంతపురం న్యూసిటీ: మునిసిపల్‌ పాఠశాలల్లో యథావిధిగా తెలుగు మీడియం కొనసాగించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నేతలు డిమాండ్‌ చేశారు. డిమాండ్‌ సాధనలో భాగంగా గురువారం అనంతపురం నగర పాలక సంస్థ ఎదుట సమాఖ్య నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నేతలు రమణయ్య(యూటీఎఫ్‌), ఫణిభూషణ్‌(తెలుగునాడు), రామాంజినేయులు(ఎస్‌టీయూ), సాయప్ప(ఏపీటీఎఫ్‌) మాట్లాడుతూ... మునిసిపల్‌ పాఠశాలల్లో ఉన్నఫలంగా ఇంగ్లీష్‌ మీడియంను మాత్రమే ప్రవేశపెడితే చదువుకు విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి తలెత్తుతుందన్నారు.

గతంలోలాగే తెలుగు, ఇంగ్లీష్‌ సమాంతర మీడియంలు కొనసాగించాల్సిందేనన్నారు. విద్యా సంవత్సరం మొదలై 40 రోజులు గడుస్తున్నా పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదని, ఇలాగైతే విద్యను ఏవిధంగా బోధించాలని ప్రశ్నించారు. పురపాలక పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్‌రూల్స్‌ పరిధిలోకి తీసుకురావాలన్నారు. ప్రధానోపాధ్యాయులకు గెజిటెడ్‌ హోదా కల్పించి జీఓ 40లో ఉన్న అధికారాలను ఇవ్వాలని కోరుతూ నగర పాలక సంస్థ కార్యదర్శి జ్యోతిలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. 

Advertisement
Advertisement