Sakshi News home page

‘సహకార’ ‘సమ్మె’ట

Published Wed, Jul 12 2017 5:40 AM

‘సహకార’ ‘సమ్మె’ట

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌
సమ్మె నోటీసు అందజేసిన ఉద్యోగులు
ఈ నెల 17 నుంచి విధులకు దూరం
పీఏసీఎస్‌ కార్యాలయాలకు తాళం..!
ఉమ్మడి జిల్లాలో 77 సొసైటీలు. 397మందికి పైగా ఉద్యోగులు

ఆదిలాబాద్‌అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా సహకార శాఖ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. ఆయా జిల్లాల సహకార శాఖ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్‌) కార్యాలయాల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.  తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా సమస్యల పరిష్కారంపై ఎలాంటి స్పందన లేదని ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు.

సమస్యలు పరిష్కరించాలని గతంలో పలుసార్లు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు విన్నవించినా పరిష్కారానికి నోచుకోలేదని సమ్మెకు సిద్ధమయ్యారు. ఇందులో బాగంగానే సోమవారం ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించి డీసీవో, డీడీఎం, నాబార్డు, డీసీసీబీ సీఈవోలకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ నెల 14న హైదరాబాద్‌లోని ఆర్‌సీఎస్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నారు. అయినా ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 17 నుంచి నిరంతరంగా సమ్మె చేపట్టనున్నట్లు సమ్మె నోటీసులో పేర్కొన్నారు. దీంతో పీఏసీఎస్‌ కార్యాలయాలు కొన్ని రోజులుగా మూతపడేలా కనిపిస్తున్నాయి.

అసలు సమస్య ఇదీ..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్‌) ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 397 మందికిపైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఒక్కో సంఘంలో ఒక్కో కార్యనిర్వహణ అధికారి, ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్లు పని చేస్తున్నారు. చిన్న సొసైటీలో ఇద్దరు చొప్పున, పెద్ద సొసైటీలో ఐదారుగురు అసిస్టెంట్ల చొప్పున విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 28 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి.

వీటి పరిధిలో సుమారు వందమందికి పైగా ఉద్యోగులున్నారు. కుమురంభీం(ఆసిఫాబాద్‌) జిల్లాలో 12 సొసైటీలు, నిర్మల్‌లో 17 సొసైటీలు, మంచిర్యాలలో 28 సొసైటీలు ఉన్నాయి. ఈ మూడు జిల్లాల పరిధిలో కార్యనిర్వహణ అధికారులు కాకుండా దాదాపు 220 మందికిపైగా ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి గత ఎనిమిదేళ్లుగా వేతనాల పెంపు లేదు. ఉద్యోగుల వేతనాల కోసం గత ప్రభుత్వం జూన్‌ 2009లో జీవో 151ను జారీ చేసింది.

ఈ జీవో ప్రతి ఐదేళ్లకోసారి సవరించాల్సి ఉంటుంది. జీవో కాలపరిమితి 2014 మార్చిలో ముగిసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి జీవోలు ఇవ్వలేదు. ఉన్న జీవోను సైతం రివైజ్‌ చేయలేదు. దీనిపై ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఈ జీవోను సవరిస్తే సహకార ఉద్యోగులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌తోపాటు ఉద్యోగం చేస్తున్నవారికి పే స్కేల్, డీఏ, హెచ్‌ఆర్‌ఏ పెరుగుతుంది. జీవో కాలపరిమితి ముగిసి మూడేళ్లు దాటినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.
ఉద్యోగుల డిమాండ్లు ఇవీ..
♦ ఉద్యోగులకు భద్రత కల్పించి వేతన సవరణ చేయాలి. జీవో నం.151ని సవరించి ప్రస్తుతం ఉన్న ధరలకు అనుగుణంగా కొత్త వేతనాలు ఇవ్వాలి.
♦ సీఈవోలకు బ్యాంకు సూపర్‌వైజర్‌ స్కేల్, స్టాఫ్‌ అసిస్టెంట్లకు క్లర్క్‌ స్కేల్, సబ్‌స్టాఫ్‌కి అటెండర్‌ స్కేల్‌ ఇవ్వాలి.
♦ వేతనాల చెల్లింపు సందర్భంగా నాబార్డు గైడ్‌లైన్స్‌ అడ్డంకులు తొలగించాలి. డీసీసీబీలకు ఉన్న 2 శాతం వర్కింగ్‌ ఫండ్‌ పీఏసీఎస్‌లకు వర్తింపజేయాలి.
♦ వేతనాలకు కావాల్సిన డబ్బులను టెస్కాబ్, డీసీసీబీ, పీఏసీఎస్‌లు సమానంగా భరించాలి. పీఏసీఎస్‌ శ్రమ, కృషి వలనే డీసీసీబీ, టెస్కాబ్‌లు తక్షణ ప్రయోజనం పొందుతున్నాయి.
♦ డీసీసీబీలో ఐదవ క్యాడర్‌ ఖాళీ పోస్టులను పీఏసీఎస్‌ ఉద్యోగులతో భర్తీ చేయాలి. పీఏసీఎస్‌లకు గతంలో ఇచ్చిన 25 శాతం కోటాను యధావిధిగా కొనసాగించాలి.
♦  సహకార సంఘాలను బలోపేతం చేయాలి. ప్రభుత్వం నిధులు సమకూర్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీటి ద్వారానే అమలు చేయాలి.
♦  ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగులకు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ పెంచాలి. గ్రాట్యూటీ రూ.10 లక్షల వరకు ఇవ్వాలి.
♦ డీసీసీబీలో ఉన్న పీఏసీఎస్‌ల వాటాధనంపై 6 శాతం సంఘాలకు వడ్డీ చెల్లించాలి. ఈ పద్ధతి సీడెడ్‌ (కమర్షియల్‌ బ్యాంకుల) పరిధిలోని సంఘాలలో అమలులో ఉంది.
♦ ఉద్యోగులందరికీ పింఛన్‌ సౌకర్యం కల్పించాలి.


రైతులకు ఇబ్బందులేనా.?
ప్రతి యేడాది ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయ రైతులకు సహకార సంఘాలు తమ సహకారాన్ని అందిస్తున్నాయి. మండలాలు, గ్రామాల పరిధిలోని వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాల ద్వారా రైతులకు పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు అందజేస్తున్నాయి. ఎక్కడా తిరగకుండా పీఏసీఎస్‌ల ద్వారా రైతులు నేరుగా విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు పొందుతున్నారు. జూలై మొదటి వారంలో పంపిణీ షురువైనా పంట రుణాలు ఇప్పటి వరకు కొంత మంది రైతులకు ఇచ్చారు.

మరికొంత మంది రైతులకు పంట రుణాలు ఇవ్వాల్సి ఉంది. అధికారులు అందుబాటులో ఉండి బ్యాంకులు, పీఏసీఎస్‌ల ద్వారా రుణాలు అందజేస్తున్న జిల్లాకు కేటాయించిన పంట రుణ లక్ష్యంలో సగం కూడా ఇవ్వడం లేదు. ఇక ఈ నెల 17 నుంచి పీఏసీఎస్‌ ఉద్యోగులు సమ్మెబాట పట్టనుండడంతో ఆ ప్రభావం రుణాలపై పడనుంది. ఫలితంగా రైతులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

పలుసార్లు విన్నవించాం
సహకార ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి గతంలో చాలాసార్లు విన్నవించాం. అయినా ఇంతవరకు స్పందించలేదు. దీంతో రాష్ట్ర కమిటీతో సమావేశమై సమ్మె చేయాలని నిర్ణయించాం. గ్రామాలు, మండలాల్లో ఉన్న సొసైటీల ద్వారా రైతులకు సేవ చేసినప్పటికీ మాకు గుర్తింపు లేదు. ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించి కొత్త వేతనాలు ఇవ్వాలి.
– పండరి, సహకార ఉద్యోగుల సంఘం ఆదిలాబాద్‌ జిల్లా కార్యదర్శి

జీవోను సవరించాలి
గత ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.151ను సవరించాలి. ఉద్యోగుల వేతనాలతోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ పెరుగుతుంది. ఈ జీవోను ఐదేళ్లకోసారి సవరించాల్సి ఉన్నా.. తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోవడం లేదు. సొసైటీల ద్వారా రైతులకు అనేక సదుపాయాలు కల్పించినా మా కష్టానికి ప్రతిఫలం దక్కడం లేదు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.
– రాంరెడ్డి, సీఈవో, పీఏసీఎస్‌ జామిడి, మం: తాంసి

Advertisement
Advertisement