ఎట్టకేలకు వేటు | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు వేటు

Published Mon, Aug 15 2016 11:34 PM

corporation staff suspended

  • ముగ్గురు బల్దియా ఎస్‌ఏల సస్పెన్షన్‌
  •  పీఎఫ్‌ చెల్లింపులో నిర్లక్ష్య ఫలితం 
  • కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌ నగరపాలక సంస్థలో కాంట్రాక్టు కార్మికుల పీఎఫ్‌ చెల్లింపులో నిర్లక్ష్య వ్యవహారంపై ముగ్గురు ఉద్యోగులపై వేటు పడింది. వెయ్యి మంది కార్మికులకు సంబంధించిన పీఎఫ్‌ చెల్లింపులో జరిగిన జాప్యంతో బల్దియాలకు పీఎఫ్‌ శాఖ రూ.3.82 కోట్లు జరిమానా వి«ధించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ పూర్తయిన అనంతరం సీనియర్‌ అసిస్టెంట్లు కనకరాజు, తిరుపతి, ఖాదర్‌మోహినొద్దీన్‌ను సస్పెండ్‌ చేస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. 2007 ఫిబ్రవరి నుంచి 2014 మే వరకు కార్మికులకు చెల్లించాల్సిన పీఎఫ్‌లో జరిగిన జాప్యంపై పీఎఫ్‌శాఖ బల్దియాకు భారీ జరిమానా విధించింది. దీంతో అధికారులు, పాలకవర్గం జరిమానా తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ వీలుకాలేదు. పీఫ్‌ అధికారులు బల్దియా అకౌంట్లు ఫ్రీజింగ్‌ చేసి మరీ జరిమానా వసూలు చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న నగర మేయర్‌ రవీందర్‌సింగ్, కమిషనర్‌ కృష్ణభాస్కర్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా ఆమె విచారణకు ఆదేశించింది. 
     
    మరో ఇద్దరిపై చర్యలు
    విచారణాధికారిగా కొనసాగుతున్న జిల్లా కోఆపరేటివ్‌ అధికారి అంబయ్య నగరపాలక సంస్థకు చెందిన ఏడుగురు ఉద్యోగులను ఈ ఏడాది జూలై 11న కోఆపరేటివ్‌ కార్యాలయానికి పిలిపించుకొని విచారణ చేపట్టారు. సదరు ఉద్యోగులతో పీఎఫ్‌ చెల్లింపులో జరిగిన నిర్లక్ష్యంపై లిఖిత పూర్వకంగా వాంగ్మూలం తీసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని గుర్తించేందుకు చేపట్టిన విచారణలో ముగ్గురిని బాధ్యులుగా చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సోమవారం సీనియర్‌ అసిస్టెంట్లు కన కరాజు, తిరుపతి, ప్రస్తుతం ఆర్వో–1గా పనిచేస్తున్న ఖాదర్‌మోహినొద్దీన్‌లను సస్పెండ్‌చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కార్మికుల సొమ్మును వేతనాల్లోంచి మిన హాయించుకుని పీఎఫ్‌ కార్యాలయానికి చెల్లించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ఉన్నతాధికారులు మరో ఇద్దరు ఉద్యోగులపై కఠిన ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బల్దియా ఉద్యోగులు నిర్లక్ష్యం కారణంగా వివిధ పన్నుల రూపంలో జమైనా ప్రజాధనం జరిమానా రూపంలో పీఫ్‌ ఖాతాకు పోవడం విశేషం.

Advertisement

తప్పక చదవండి

Advertisement