అవినీతి ‘చిచ్చు’ | Sakshi
Sakshi News home page

అవినీతి ‘చిచ్చు’

Published Fri, Jan 20 2017 11:46 PM

corruprtion in anantapur muncipal corporation

- కార్పొరేషన్‌లో అవినీతిపై ‘సాక్షి’ వరుస కథనాలతో కలకలం
- అవినీతికి మీరంటే మీరే బాధ్యులని ఎమ్మెల్యే, మేయర్‌ వర్గాల తగువులాట
– కమిషనర్‌కు అండగా ఎమ్మెల్యే?..వద్దని డీఎంఈకి మేయర్‌ స్వరూప లేఖ !
– ఎస్‌ఈ సత్యనారాయణ రాకతో డోలాయమానంలో సురేంద్రబాబు
– ఎస్‌ఈని కాకుండా ఈఈని కమిషనర్‌(ఎఫ్‌ఏసీ)గా కొనసాగించడంపై సర్వత్రా చర్చ
– అడ్డగోలు బిల్లులపై లోకాయుక్త, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌కు ఫిర్యాదు


(సాక్షిప్రతినిధి, అనంతపురం)
నగర పాలక సంస్థ అవినీతిలో అధికారుల ప్రమేయం, ప్రజాప్రతినిధుల బాధ్యతారాహిత్యంపై  ‘సాక్షి’లో ప్రచురితమవుతున్న వరుస కథనాలు పాలకవర్గంతో పాటు అధికార పార్టీలో కలకలం సృష్టించాయి. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే, మేయర్‌ వర్గాల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. అవినీతికి మీరంటే మీరే కారణమంటూ ఇరువర్గాల వారు పరస్పరం అంతర్గత దూషణలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే కమిషనర్‌ నియామకఽ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దీంతో కార్పొరేషన్‌ పాలకవర్గంతో పాటు అధికార పార్టీలో విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నట్లు మరోసారి స్పష్టమవుతోంది.

         నగర పాలక సంస్థలో రూ.72 కోట్ల విలువైన పనులు జరిగాయని లెక్కలు చూపుతున్నారు. వాస్తవానికి ఇందులో 50 శాతం కూడా పూర్తిస్థాయిలో జరగలేదని,  తప్పుడు లెక్కలు చూపి నిధులు స్వాహా చేశారని ఆరోపణలున్నాయి. ఒకే పనికి రెండు బిల్లులు చేసిన ఘటనలూ ఉన్నాయి. ఈ క్రమంలో ఏ కమిషనర్‌ వచ్చినా నగర పాలక సంస్థ తీరులో ఇసుమంతైనా మార్పులేదని శుక్రవారం ‘ఆగని దందా’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలోనే కమిషనర్‌ ‘నియామకాల’పై అధికార పార్టీలో రచ్చ మొదలైంది.

సురేంద్ర వద్దంటూ డీఎంఈకి మేయర్‌ లేఖ
        కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఈఈ సురేంద్రబాబుకు ఎఫ్‌ఏసీ ఇవ్వొద్దంటూ డీఎంఈ కన్నబాబుకు మేయర్‌ స్వరూప డిసెంబర్‌ 3న లేఖ రాసినట్లు కొందరు కార్పొరేటర్లు చెబుతున్నారు. సురేంద్ర ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈగానూ ఉన్నారని,  ఈయనపై చాలా ఆరోపణలు ఉన్నాయని, ఇలాంటి వ్యక్తికి ఎఫ్‌ఏసీ ఇవ్వొద్దని లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. అడిషనల్‌ కమిషనర్‌ పగడాల కృష్ణమూర్తికి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. పగడాల కృష్ణమూర్తికి కమిషనర్‌గా ఉత్తర్వులు వచ్చినా.. ఆ సాయంత్రానికే రద్దు ఆదేశాలు కూడా అందాయి. 

ఈ తతంగంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి హస్తం ఉందని, కమిషనర్‌గా సురేంద్ర నియామకంలో ఆయన చక్రం తిప్పారని మేయర్‌ వర్గం ఆరోపిస్తోంది. తనకు అనుకూలంగా ఉండే కమిషనర్‌ను నియమించుకుంటే మేయర్‌ అనివార్యంగా తన చెప్పుచేతల్లో  ఽఉంటుందనేది ఎమ్మెల్యే వ్యూహంగా కన్పిస్తోంది. సురేంద్ర నియామకం తర్వాత కూడా ఈ నెల 11న మరోసారి డీఎంఈకి మేయర్‌ లేఖ రాసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.3 కోట్ల విలువైన బిల్లుల మంజూరులో కమిషనర్‌ పారదర్శకంగా వ్యవహరించలేదని, తద్వారా కార్పొరేషన్‌లో అవినీతికి ఆస్కారం ఇచ్చినవారయ్యారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని లేఖలో పేర్కొన్నట్లు స్వరూప వర్గీయులు చెబుతున్నారు. మేయర్‌ లేఖలను బట్టి సురేంద్ర నియామకంలో ఎమ్మెల్యే, మేయర్‌ మధ్య విభేదాలు పొడచూపాయనేది స్పష్టమవుతోంది.

కొత్త ఎస్‌ఈ రాకతో..
        ఈఈగా ఉన్న సురేంద్రబాబు ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈగానూ ఉన్నారు. రెగ్యులర్‌ ఎస్‌ఈగా తిరుపతి నుంచి వచ్చిన సత్యనారాయణ ఈ నెల నాలుగున బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ బాధ్యతలు ఎస్‌ఈకి ఇవ్వాల్సి ఉంటుంది. కాదని సురేంద్రను కొనసాగిస్తే నిబంధనలకు విరుద్ధంగా ఈఈ  కింద ఎస్‌ఈ పనిచేయాల్సి వస్తుంది. సురేంద్ర నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న స్వరూప ఈ అంశాన్ని కూడా డీఎంఈకి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో సత్యనారాయణకు ఎఫ్‌ఏసీ ఇస్తారా? సురేంద్రను కొనసాగించేలా ఎమ్మెల్యే ప్రయత్నిస్తారా? లేదంటే వీరిద్దరూ కాదని రెగ్యులర్‌ కమిషనర్‌ను డీఎంఈ నియమిస్తారా? అనేది తేలాల్సి ఉంది.

అవినీతిపై ఫిర్యాదులు
        కార్పొరేషన్‌ అవినీతిపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలతో పాటు పూర్తి ఆధారాలను సేకరించి లోకాయుక్తతో పాటు సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌కు ఫిర్యాదు చే సేందుకు కొందరు విపక్ష కార్పొరేటర్లతో పాటు కొందరు అధికార పార్టీ కార్పొరేటర్లు కూడా సిద్ధమయ్యారు. ‘అనంత’ విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితమూ ఉండదని భావించిన వీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికార పార్టీ కార్పొరేటర్‌ హరితతో పాటు మరో ఏడుగురు కార్పొరేటర్లు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు టీడీపీ నేత జయరాం నాయుడు ‘సాక్షి’కి తెలిపారు. ఈ వ్యవహారంతో మరోసారి కార్పొరేషన్‌లో మేయర్, ఎమ్మెల్యే వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరే అవకాశముంది.

Advertisement
Advertisement