ఒక్కటిగా బతికారు... ఒక్కటైపోయారు | Sakshi
Sakshi News home page

ఒక్కటిగా బతికారు... ఒక్కటైపోయారు

Published Sun, Jul 3 2016 5:50 PM

ఒక్కటిగా బతికారు... ఒక్కటైపోయారు - Sakshi

పది నిమిషాల వ్యవధిలో లోకాన్ని వీడిన దంపతులు
 విశాఖపట్నం జిల్లా :  బతికినంత కాలం ఒకరి కోసం ఒకరు అన్నట్టు అన్యోన్యంగా బతికారు. చివరి వరకూ ఒకరికొకరు తోడుంటామని పెళ్లి నాడు చేసిన ప్రమాణం తు.చ తప్పకుండా పాటించారు. బతుకైనా, చావైనా కలిసే అనుకున్నారేమో.. పది నిమిషాల వ్యవధిలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు ఆ భార్యాభర్తలు. అక్కయ్యపాలెం లలితానగర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికుల్ని, బంధువుల్ని కలచివేసింది. పుక్కాల లక్ష్మణరావు (75) విద్యాశాఖలో సీనియ ర్ అసిస్టెంట్‌గా పని చేసి రిటైరయ్యారు.
 
  భార్య రాజేశ్వరమ్మ (68) విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. కొడుకు, కోడలితో కలసి లలితానగర్‌లో నివాసం ఉంటున్నారు. లక్ష్మణరావు ముడేళ్ల నుంచి అస్వస్థతకు గురై మంచంపైనే ఉంటున్నారు. భార్య రాజేశ్వరమ్మ అతనికి సపర్యలు చేస్తూ వస్తోంది. శనివారం తెల్లవారుజామున 2గంటల సమయంలో లక్ష్మణరావు ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. భర్త పరిస్థితి చూసి ఆందోళనకు గురైన రాజేశ్వరమ్మ ఒక్కసారిగా కూలబడింది. గుండె కొట్టుకోవడం నెమ్మదించింది.
 
 ఇంతలో ఆమె కొడుకు ప్రసాద్ 108 వాహనానికి ఫోన్ చేసి సమాచారమిచ్చారు. సిబ్బంది వచ్చి నాడి పరిశీలించి రాజేశ్వరమ్మ చనిపోయినట్టు నిర్ధారించారు. కళ్లెదుటే భార్య మృతిచెందడాన్ని చూసి తట్టుకోలేకపోయిన లక్ష్మణరావు కూడా పది నిమిషాల వ్యవధిలోనే ఈ లోకాన్ని విడిచారు. ఈ సంఘటన చుట్టు పక్కల వారిని, బంధువులను, కుటుంబ సభ్యులను కలచివేసింది.
 
  సుమారు 50 ఏళ్ల దాంపత్య జీవితంలో దంపతులిద్దరూ ఏనాడూ ఘర్షణ పడలేదని, వారిద్దరి అనుబం ధం, ఆప్యాయత నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని బంధువులు చెప్పుకుంటున్నారు. సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య అక్కయ్యపాలెంలోని శ్మశానవాటికలో దంపతులను ఒకే చితిపై ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement
Advertisement