రైతు సమస్యలపై రాజీలేని పోరాటం | Sakshi
Sakshi News home page

రైతు సమస్యలపై రాజీలేని పోరాటం

Published Mon, Jul 24 2017 11:12 PM

రైతు సమస్యలపై రాజీలేని పోరాటం - Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌:

రైతు సమస్యలపై సీపీఐ రాజీలేని పోరాటం చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు మూడు రోజుల జైల్‌భరో కార్యక్రమంలో భాగంగా సోమవారం అనంతపురం నగరంలోని స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ప్రధాన శాఖ ఎదుట నిర్వహించిన ధర్నాలో రామకృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాయలసీమ జిల్లాల్లో వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవడంతో రైతులు, కూలీల వలసలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వైపు ప్రకృతి కన్నెర్ర చేస్తుండగా మరోవైపు పాలక ప్రభుత్వాలు రైతులను కష్టాల్లోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. ఆత్మహత్యలు నివారిస్తామని, డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ సిఫారసులు అమలు చేస్తామని, రూ.లక్ష కోట్లతో ధరల స్థిరీకరణ నిధితో రైతులను ఆదుకుంటామని గొప్పలు చెప్పి మూడు సంవత్సరాల క్రితం ఆధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆచరణలో పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు.

మరోవైపు రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతుకు అండగా ఉంటామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత అభివృద్ధిని సీఎం పూర్తిగా విస్మరించారన్నారు. ఇన్‌పుట్, ఇన్సూరెన్స్, ప్రభుత్వ పథకాల రాయితీలు అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ సీపీఐ పోరుబాట కొనసాగుతుందన్నారు. అనంతరం పోలీసులు రామకృష్ణతో పాటు మరికొందరు నేతలను అరెస్టు చేసి టూటౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement