ఖమ్మం ఎమ్మెల్సీ కోసం టీడీపీతో సీపీఐ మంతనాలు | Sakshi
Sakshi News home page

ఖమ్మం ఎమ్మెల్సీ కోసం టీడీపీతో సీపీఐ మంతనాలు

Published Tue, Dec 8 2015 11:16 PM

ఖమ్మం ఎమ్మెల్సీ కోసం టీడీపీతో సీపీఐ మంతనాలు - Sakshi

సాక్షి, హైదరాబాద్: స్థానికసంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం సీటును గెలుచుకునేందుకు సీపీఐ కసరత్తు ప్రారంభించింది. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీవ్ర పోటీ నేపథ్యంలో టీడీపీ మద్దతును కూడ గట్టేందుకు ఆపార్టీనాయకులతో సంప్రదింపులు మొదలుపెట్టింది. ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి సీపీఐ పోటీపడుతుండగా, ఆ పార్టీకి గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో రాజకీయంగా పోటాపోటీ పరిస్థితులు ఎదురైనందున, శాసనమండలిలో ప్రాతినిధ్యం సాధించేందుకు పావులు కదుపుతోంది.

గతంలోనే జరిగిన భేటీలో సీపీఐకు ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ సీటును, సీపీఎంకు నల్లగొండ ఎమ్మెల్సీ సీటును కేటాయించాలని వివిధ వామపక్షాలు నిర్ణయించాయి. ఖమ్మం జిల్లా నుంచి సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు పేరును కూడా గతంలోనే సీపీఐ నాయకత్వం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీసీటుకు మద్దతు కోరేందుకు మంగళవారం టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావుతో సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి తదితరులు సమావేశమయ్యారు.

 

వరంగల్‌జిల్లా పాలకుర్తి నియోజకవర్గపరిధిలో దొడ్డి కొమురయ్య స్మారక భవనం నిర్మించే విషయంపై స్థానిక ఎమ్మెల్యే అయిన దయాకర్‌రావుతో చర్చించేందుకే ఆయనను కలుసుకున్నట్లు చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా టీఆర్‌ఎస్ అభ్యర్థిని ఓడించడంలో భాగంగా ఖమ్మంజిల్లా టీడీపీనేతలు సీపీఐకు మద్దతునిచ్చేందుకు సుముఖతను వ్యక్తం చేసినట్లు సీపీఐ నేత ఒకరు తెలిపారు. ఈ స్థానానికి ఇదివరకే వైఎస్సార్‌సీపీ తెలంగాణ కూడా లింగాల కమల్‌రాజ్‌ను తన అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో తమకు మద్దతునివ్వాల్సిందిగా వైఎస్సార్‌సీపీ నేతలను సీపీఐనేతలు కోరినట్లు సమాచారం.

ఖమ్మం కార్పొరేషన్‌కు సీపీఐ హామీ కోరుతున్న కాంగ్రెస్‌నేతలు
ఖమ్మం జిల్లాలో సీపీఐకు మద్దతునిచ్చినందున, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతునిచ్చేలా సీపీఐనాయకత్వం నుంచి కచ్చితమైన హామీ తీసుకోవాలని ఆ జిల్లానేతలు రాంరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి సుధాకరరెడ్డి, వనమావెంకటేశ్వరరావు, రేగా కాంతారావు గట్టిగా కోరుతున్నారు. అంతేకాకుండా వామపక్షాలకు బలమున్న జిల్లాల్లో ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో సీపీఐ మద్దతునిచ్చేలా చూడాలని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. మరోవైపు వామపక్షాల పొత్తు అవసరమని భావిస్తున్న ఇతరనేతలు సీపీఐకు మద్దతునివ్వాలని నాయకత్వాన్ని కోరుతున్నారు.ఇక నల్లగొండజిల్లా ఎమ్మెల్సీ సీటుకు సీపీఎం అభ్యర్థిని నిలుపుతుందా లేదా నిలపకపోతే ఎటువంటి వైఖరిని అనుసరించాలనే దానిపై స్పష్టత రాలేదు.

సోదర వామపక్షాల దారెటు..?
ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల్లో బలమున్న, గణనీయంగానే ఎంపీటీసీ,జడ్‌పీటీసీలున్న సీపీఎం, న్యూడెమోక్రసీ-రాయల, చంద్రన్న వర్గాలు సీపీఐ అభ్యర్థికి ఏమేరకు మద్దతునిస్తాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతం నుంచి ఈ జిల్లాలో సీపీఐ-సీపీఎంల మధ్యవిభేదాలు, న్యూడెమోక్రసీ పార్లమెంటరీ రాజకీయాలు, ఎన్నికల పట్ల ఆచితూచి వ్యవహరిస్తున్న నేపథ్యంలో సోదర వామపక్షాల నుంచి ఏ మేరకు సహకారం అందుతుందన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతును సీపీఐ తీసుకుంటున్న నేపథ్యంలో సీపీఎం ఏ వైఖరిని అవలంబిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement