కేసీఆర్‌ది ద్వంద్వ వైఖరి | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ది ద్వంద్వ వైఖరి

Published Fri, May 26 2017 3:47 PM

కేసీఆర్‌ది ద్వంద్వ వైఖరి - Sakshi

మిర్యాలగూడ : సీఎం కేసీఆర్‌ బీజేపీ పట్ల ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం మిర్యాలగూడలో సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను విమర్శిస్తున్న కేసీఆర్‌.. ప్రధాని మోడీ మంచివాడని చెప్పడంలో అర్ధం లేదన్నారు. మోడీ, అమిత్‌షా వేర్వేరు కాదని, కేసీఆర్‌ ప్రకటనను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

తెలంగాణాకు రూ.లక్ష కోట్లు ఇచ్చామని చెప్పిన అమిత్‌షా ఆయన ఇంట్లో నుంచి ఇచ్చాడా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో రూ.5 లక్షల కోట్లు వసూలు చేసి కేవలం రూ.లక్ష కోట్లు ఇచ్చామని చెబుతున్నారని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏయే రంగాలకు కేటాయించారో సీఎం కేసీఆర్‌ తెలంగాణా ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. దళితుల పట్ల దాడులు చేస్తూనే.. వారితో బీజేపీ నాయకులు సహపంక్తి భోజనాలు చేస్తున్నారని చెప్పారు. అమిత్‌షా దళిత వాడల్లో సహపంక్తి భోజనాలు చేయడం చూస్తుంటే.. పెళ్లి భోజనాలు చేసినట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలను మోసం చేస్తున్నాయని చెప్పారు. ఎన్నికల మెనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేయడం లేదని పేర్కొన్నారు. మూడేళ్లుగా అధికారంలో ఉన్నా.. హామీల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్, నాయకులు మల్లు గౌతమ్‌రెడ్డి, మహ్మద్‌బిన్‌ సయ్యద్, రెమడాల పరుశురాములు తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement