ఫిన్స్‌తో నేరస్తుల భరతం పడ్తాం | Sakshi
Sakshi News home page

ఫిన్స్‌తో నేరస్తుల భరతం పడ్తాం

Published Sun, Aug 21 2016 11:18 PM

ఫిన్స్‌ యంత్రం పనితీరునుపరిశీలిస్తున్న ఎస్పీ - Sakshi

– పుష్కరాల్లో నలుగురు నేరస్తులను గుర్తించాం
– విజయవాడలో వందమందిని పట్టించింది
– త్వరలో అన్ని పోలీసు స్టేషన్‌కు విస్తరిస్తాం
 
 
శ్రీశైలం(జూపాడుబంగ్లా):  ఫిన్స్‌(ఫింగర్‌ ఫ్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ నెట్‌వర్క్‌ సిస్టం)తో నేరస్తుల భరతం పట్టనున్నట్లు జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. ఆదివారం లింగాలగట్టు దిగువఘాటులో ఫిన్స్‌ ద్వారా అనుమానితుల వేలి ముద్రలను సేకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫిన్స్‌ యంత్రంలో రాష్ట్రనలుమూలలకు చెందిన నేరస్తుల వేలిముద్రలతోపాటు వారి సమాచారాన్ని ట్యాబ్‌లో పొందుపర్చి వాటిని ఆన్‌లైన్‌తో అనుసంధానం చేస్తామని తెలిపారు. అనుమానితులు ఎవరైనా పట్టుబడినçప్పుడు ఫింగర్‌ఫ్రింట్‌ యంత్రాన్ని ట్యాబ్‌ను అనుసంధానించి తద్వారా వారి వేలిముద్రలు సేకరించటం జరుగుతుందని వారి వేలిముద్రలు అప్పటికే నమోదైన వేలిముద్రలతో సరిపోతే వారి వివరాలు వెంటనే వెల్లడవుతాయన్నారు. తద్వారా గతంలో వారు ఎక్కడెక్కడ ఎలాంటి నేరాలకు పాల్పడ్డారు, ప్రస్తుతం మారు పేర్లతో ఎలాంటి నేరాలకు పాల్పడుతున్నారనే వివరాలను సులభంగా తెలుసుకోవచ్చునన్నారు. పుష్కరాల సందర్భంగా పాతాళగంగ ఘాటులో టీ అమ్ముకుంటూ అనుమానంగా సంచరిస్తున్న ఇద్దరి వ్యక్తుల వేలిముద్రలు సేకరించగా వారి గత నేరచరిత్ర వెల్లడవ్వటంతో వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.   విజయవాడలో ఫిన్స్‌ యంత్రం ద్వారా వంద మందికిపైగా నేరస్తులను పట్టుకున్నట్లు తెలిపారు.  ఈ యంత్రం ద్వారా సత్ఫలితాలు వస్తే ఐజీ, డీఐజీల సహకారంతో ఫిన్స్‌ యంత్రాన్ని అన్ని పోలీసుస్టేషన్లకు విస్తరిస్తామని ఎస్పీ తెలిపారు.  కార్యక్రమంలో డీఎస్పీ సుప్రజ పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement