ఆయుకట్టుకు గండం | Sakshi
Sakshi News home page

ఆయుకట్టుకు గండం

Published Sat, Aug 20 2016 12:42 AM

ఆయుకట్టుకు గండం - Sakshi

హెచెఎల్సీ కింద తొలిసారి ‘క్రాప్‌ హాలిడే’ సూచనలు
టీబీ డ్యాంకు ఆశించిన స్థాయిలో చేరని నీరు
హంద్రీ–నీవాకు పుష్కలంగా నీరొస్తేనే ఊరట


జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న తుంగభద్ర జలాశయానికి          (టీబీ డ్యాం) ఈ ఏడాది ఆశించిన స్థాయిలో నీరు చేరడం లేదు.     నది పరీవాహక ప్రాంతంలో వర్షాభావానికి తోడు ఎగువన నిర్మించిన ప్రాజెక్టులతో డ్యాంలోకి ఇన్‌ఫ్లో గణనీయంగా తగ్గిపోయింది. దీనివల్ల ఈ ఏడాది తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) కింద ఆయకట్టుకు నీటి విడుదల ప్రశ్నార్థకంగా మారింది. తొలిసారిగా ‘క్రాప్‌ హాలిడే’ సూచనలు కన్పిస్తున్నాయి.  

అనంతపురం సెంట్రల్‌ : తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) పరిధిలో మొత్తం 2.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో  విస్తరించి ఉన్న ఈ ఆయకట్టులో ప్రతియేటా దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఈ ఏడాది మాత్రం నీలినీడలు కమ్ముకున్నాయి. టీబీ డ్యాంలో ఆశించిన మేర నీరు చేరకపోవడమే ఇందుకు కారణం. గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో 74 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ఈ ఏడాది 51 టీఎంసీలు మాత్రమే ఉంది. ముఖ్యంగా డ్యాంలోకి నీటి చేరిక (ఇన్‌ఫ్లో) మందకొడిగా ఉంది. గత ఏడాది ఈ సమయంలో 22,971 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఈ సారి  మాత్రం 14,667 క్యూసెక్కులే వస్తోంది.  అది కూడా  వారం నుంచి పెరిగింది. పదిరోజుల క్రితం నాలుగు వేల క్యూసెక్కులే ఉండేది.


దీనివల్ల ఆయకట్టుకు నీటి విడుదల ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోనే అత్యధిక ఆయకట్టు  హైలెవల్‌ మెయిన్‌ కెనాల్‌(హెచ్‌ఎల్‌ఎంసీ) పరిధిలోని కణేకల్లు, బొమ్మనహాల్‌ మండలాల్లో ఉంది. ఇక్కడ ప్రతి ఏటా వేలాది ఎకరాల్లో వరి, ఇతర పంటలు సాగు చేస్తున్నారు.  ఎప్పుడూ ఈ సమయానికి మెయిన్‌ కెనాల్‌ పరిధిలో పంటలకు నీరు వదిలేవారు. ఈ సారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. మెయిన్‌ కెనాల్‌ పరిధిలోనే ఇలా ఉంటే.. ఇక ఉపకాలువల పరిధిలో ఆయకట్టుకు నీరివ్వడం అసాధ్యమేనని  రైతులు అంటున్నారు. నీరివ్వకపోతే మెయిన్‌ కెనాల్‌ పరిధిలోని  ఆయకట్టుదారుల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందేమోనని అధికారులు, ప్రజాప్రతినిధులు ముందే ఆ ప్రాంత రైతులతో సమావేశాలు నిర్వహించారు.

రెండేళ్లుగా ఇబ్బందులే
గత ఏడాది హెచ్‌ఎల్‌ఎంసీ, గుంతకల్లు బ్రాంచ్‌కెనాల్‌ (జీబీసీ) కింద  పంటలకు అరకొరగా నీరొదిలారు. మిడ్‌పెన్నార్‌ సౌత్, నార్త్‌ కెనాల్స్‌æ, తాడిపత్రి బ్రాంచ్‌ కెనాల్‌ (టీబీసీ) తదితర వాటికి చుక్కనీరు కూడా వదలలేదు. ఈ సారైనా ఇస్తారనే ఆశతో ఉన్న రైతులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ప్రస్తుతం టీబీ డ్యాంలో ఉన్న నీటి నిల్వను పరిగణనలోకి తీసుకుంటే  హెచ్చెల్సీ వాటా మరో నెల రోజుల్లో ముగిసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది దామాషా ప్రకారం హెచ్చెల్సీకి 22 టీఎంసీల నీరు వస్తుందని అంచనా వేశారు. గత నెల 25 నుంచి రోజూ 1,200 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ఇప్పటికి మూడున్నర టీఎంసీలు వచ్చాయి. మన కోటా మరో నెల రోజుల్లో ముగిస్తే 15 టీఎంసీలకు మించి వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.

హంద్రీ–నీవా ఆదుకునేనా?
ఈ ఏడాది టీబీ డ్యాం నిరుత్సాహ పరిచినా శ్రీశైలం డ్యాం మాత్రం తొణికిసలాడుతోంది. దాని నుంచి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు జిల్లాకు వస్తున్నాయి. ప్రస్తుతం జీడిపల్లి జలాశయంలో నీటిని నిల్వ చేస్తున్నారు. త్వరలో అక్కడి నుంచి పీఏబీఆర్, మిడ్‌పెన్నార్‌ రిజర్వాయర్‌కు విడుదల చేయనున్నారు. హంద్రీనీవాకు పుష్కలంగా నీరొస్తే మిడ్‌పెన్నార్‌ సౌత్, నార్త్‌ కెనాల్‌ కింద ఉన్న ఆయకట్టు కింద ఆరుతడి పంటలకైనా ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. నీరు తీసుకురావడంలో విఫలం అయితే ఈ ఏడాది కూడా క్రాప్‌హాలిడే ప్రకటించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Advertisement
Advertisement