పంటలెండిపోవడంతో.. | Sakshi
Sakshi News home page

పంటలెండిపోవడంతో..

Published Sun, Sep 4 2016 12:14 AM

పంటలెండిపోవడంతో..

  • దున్నేస్తున్నారు!
  • ఒంగోలు టౌన్‌ : ‘జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో వేసిన పంటలు ఎండుముఖం పట్టాయి. వర్షాల కోసం ఎదురు చూసిన రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ఎండిపోయిన పంటలను దున్నేశారు. ఇంత వరకూ వాటికి సంబంధించిన వివరాలు వ్యవసాయాధికారులు సేకరించలేదు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఏవిధంగా ఇస్తారు’ అని వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ను జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ చైర్మన్, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి నిలదీశారు. శనివారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు ముందు పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన కింద నష్టపరిహారం ఏమైనా వస్తుందా.. అని వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మురళీకృష్ణను ప్రశ్నించారు. ఆయన నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ నష్టం జరిగినట్లు లెక్కలు వేశారా? దానికి సంబంధించిన సమాచారం ఉందా.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇటీవల తాను దద్దవాడలో పర్యటిస్తే పంటలు మొత్తం ఎండిపోయి దున్నేశామని రైతులు చెప్పారని, తమ వద్దకు ఒక్క అధికారి కూడా రాని విషయాన్ని వారు తన దృష్టికి తీసుకొచ్చారని వైవీ ప్రస్తావించారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కలెక్టర్‌ సుజాతశర్మ స్పందిస్తూ పంటలు ఎండిపోకుండా ఉండేందుకు జిల్లాకు 4500 రెయిన్‌గన్లు ఇచ్చినట్లు తెలిపారు. ఎంపీ జోక్యం చేసుకుంటూ నీళ్లే లేకపోతే రెయిన్‌ గన్లు ఉండి ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. మార్కాపురం శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి జోక్యం చేసుకుంటూ అనంతపురంలో కరువు నెలకొందంటూ జిల్లాకు జరుగుతున్న నష్టం గురించి పట్టించుకోకపోవడంపై తీవ్రంగా ఆక్షేపించారు. గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పత్తి పంట దెబ్బతిని రైతులు నష్టపోయారని, ఎంతమేర నష్టం జరిగిం దో రైతుల నుంచి లెక్కలు సేకరించ డం తప్పితే ఇంతవరకు పరిహారం అందించలేదన్నారు. సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ పెద్దారవీడు, దోర్నాల మండలాల రైతులకు రెయిన్‌ గన్లు వచ్చాయని, వాటిని వాడుకునేలోపు అధికారులు వెనక్కు తీసేసుకున్నారని ధ్వజమెత్తారు. పశ్చిమ ప్రకాశంలో రెయిన్‌ గన్లు తాను ఇంతవరకు చూడలేదని సురేష్‌ వ్యాఖ్యానించారు.  

Advertisement
Advertisement