Sakshi News home page

మేయర్ హత్య కేసు: చింటూ లొంగుబాటు

Published Mon, Nov 30 2015 11:58 AM

మేయర్ హత్య కేసు: చింటూ లొంగుబాటు - Sakshi

చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్‌ల హత్య కేసులో ప్రధాన నిందితుడు, మోహన్ మేనల్లుడు చింటూ లొంగిపోయాడు. సోమవారం ఉదయం అతడు చిత్తూరు కోర్టులో లొంగిపోయాడు. నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి యుగంధర్ ఎదుట లొంగిపోయిన చింటూ న్యాయమూర్తికి పలు డాక్యుమెంట్లు అందజేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పరందామ, హరిదాస్, కార్పొరేటర్ భర్త మురగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేసినవారి సంఖ్య ఎనిమిదికి చేరింది. మరో ఇద్దరు వెంకటేశ్, మొగిలికోసం కర్ణాటకలో పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది. మేయర్, ఆమె భర్త హత్యకు ప్రధానంగా కుట్రను రచించాడని, హత్యకు కావాల్సిన ఆయుధాలను పంపిణీ చేశాడని ఇప్పటికే మురగ అనే వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.

అంతకుముందు పోలీసులు కోలార్‌కు చెందిన జీఎస్.వెంకటాచలపతి (51), చిత్తూరు జిల్లా గంగవరంకు చెందిన టి.మంజునాథ్ (27), చిత్తూరు నగరంలోని గంగనపల్లెకు చెందిన కె.జయప్రకాష్ (23)ను అరెస్టు చేశారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మోహన్ మేనల్లుడు చింటూ (38) ఇప్పటివరకు పరారీలోనే ఉండి చివరికి కోర్టులో లొంగిపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement