రైళ్లలో నేరాలను నియంత్రించాలి | Sakshi
Sakshi News home page

రైళ్లలో నేరాలను నియంత్రించాలి

Published Sat, Sep 10 2016 12:53 AM

రైళ్లలో నేరాలను నియంత్రించాలి - Sakshi

  •  గుంతకల్‌ రైల్వే డివిజన్‌ ఎస్పీ సుబ్బారావు
  •  
    నెల్లూరు(క్రైమ్‌): పక్కా ప్రణాళికతో రైళ్లలో నేరాలను నియంత్రించాలని గుంతకల్‌ రైల్వే డివిజన్‌ ఎస్పీ సుబ్బారావు సూచించారు. నెల్లూరు, తిరుపతి రైల్వే సబ్‌ డివిజన్ల పోలీస్‌ అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని నెల్లూరు రైల్వే డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. రికార్డులను పరిశీలించి నేరనియంత్రణకు తీసుకుంటున్న చర్యలు.. రికవరీలు.. తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైళ్లలో నేర నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సాధ్యమైనంత వరకు అన్ని రైళ్లలో బీట్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. బీట్‌ సిబ్బంది వద్ద ఉన్న పుస్తకంలో సంబంధిత అధికారుల ఫోన్‌ నంబర్లు విధిగా ఉండాలని చెప్పారు. ఏదైనా నేరం జరిగిన వెంటనే విజయవాడ, గుంతకల్‌లోని కంట్రోల్‌రూమ్, ఉన్నతాధికారులు, సమీపంలోని రైల్వే పోలీస్‌ అధికారులకు సమాచారాన్ని అందించాలని సూచించారు. రైళ్లలో విధిగా తనిఖీలు నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక శక్తులు తారసపడితే అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారించాలని కోరారు. రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫారాల్లో బీట్‌ కానిస్టేబుళ్లను ఏర్పాటు చేసి 24 గంటలూ విధులు నిర్వర్తించేలా చూడాలని ఆదేశించారు. గతేడాది సెప్టెంబర్‌లో నాన్‌క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి రత్నంపై దుండగులు దాడి చేశారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో చీరాల నుంచి గూడూరు వరకు ఓ మహిళా కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. రైలు ప్రమాదాల్లో అనేక మంది గుర్తుతెలియని వ్యక్తులు మరణిస్తున్నారని, వీరిని గుర్తించేందుకు స్థానిక మీడియాలో విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. మృతుల రైల్వే టికెట్‌ వివరాలకు ఆయా ప్రాంత రైల్వేపోలీసులకు రెడియో మెసేజ్‌ ఇవ్వాలన్నారు. పలు పోలీస్‌స్టేషన్లలో ఎస్సై పోస్టులు ఖాళీగా ఉన్న విషయాన్ని డీజీ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే భర్తీ చేస్తామని వివరించారు. పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. నెల్లూరు, తిరుపతి రైల్వే డీఎస్పీలు మోహన్‌రావు, సూర్యచంద్రరావు, నెల్లూరు, ఒంగోలు, రేణిగుంట, తిరుపతి సీఐలు నరసింహరాజు, దశరథరామారావు, కొండయ్య, సుబ్రహ్మణ్యం, కడప, యర్రగుంట్ల, ఒంగోలు, చీరాల ఎస్సైలు  పాల్గొన్నారు. 

Advertisement
Advertisement