పంచాయతీలకు షాక్‌ | Sakshi
Sakshi News home page

పంచాయతీలకు షాక్‌

Published Mon, Mar 20 2017 10:42 PM

current bills Rs 34 crore

► కరెంట్‌ బిల్లులు రూ.34 కోట్లు 
►ఆర్థిక సంఘం నిధుల నుంచి ఇప్పటికే పది శాతం చెల్లింపు
►రెండో విడతలో 30 శాతం చెల్లించాలంటున్న విద్యుత్‌ అధికారులు
►నోటీసులు జారీ

ఆదిలాబాద్‌ : జిల్లాలోని గ్రామ పంచాయతీలకు కరెంట్‌ బిల్లు బకాయిల షాక్‌ తగులుతోంది. ఇప్పటికే ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి పది శాతం చెల్లించగా.. రెండో విడత నిధుల్లో 30 శాతం చెల్లించాలని విద్యుత్‌శాఖ పట్టుబడుతోంది. ఆ శాఖ ఏఈల ద్వారా గ్రామ పంచాయతీలకు నోటీసులూ జారీ చేసింది. దీంతో పనుల నిర్వహణ కోసం ఉపయోగించే నిధులను కరెంటట్‌ బిల్లులకు చెల్లించాల్సి రావడంతో సర్పంచుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో గ్రామపంచాయతీలకు కరెంట్‌ బిల్లు గుదిబండగా మారింది.

గ్రామపంచాయతీల్లో పనుల కోసం జనవరిలో 14వ ఆర్థిక సంఘం నిధులు మొదటి విడతలో రూ.10 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో నుంచి పది శాతం పంచాయతీల కరెంట్‌ బిల్లులు చెల్లించారు. జనవరిలో రూ.9.91 లక్షలు, ఫిబ్రవరిలో 24.33 లక్షలు కరెంట్‌ బిల్లు చెల్లించినట్లు విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండో విడత ఆర్థిక సంఘం నిధుల్లోంచి 30 శాతం నిధుల చెల్లించాలని విద్యుత్‌ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పత్రాలను పంచాయతీ అధికారులకు అందజేశారు. విద్యుత్‌శాఖ ఏఈల ద్వారా గ్రామపంచాయతీలకు నోటీసులు కూడా అందించారు.  

రూ.34 కోట్ల బకాయిలు..
జిల్లాలోని గ్రామపంచాయతీల్లో విద్యుత్‌ బకాయి బిల్లులు రూ.కోట్ల లో పేరుకుపోయాయి. గ్రామాలకు తగినన్ని నిధులు లేకపోవడంతో బిల్లులు చెల్లించడం లేదు. గ్రామపంచాయతీల్లో వీధి దీపాలు, నీటి సరఫరా, పంచాయతీ కార్యాలయాలకు కలిపి మొత్తం జిల్లా వ్యాప్తంగా రూ.34.80 కోట్ల విద్యుత్‌ బిల్లులు బకాయి ఉన్నాయి. వీటిని చెల్లించాలని విద్యుత్‌ శాఖ నుంచి జనవరిలోనే నోటీసులు అందాయి. కానీ నిధులు లేకపోవడంతో అవి పెండింగ్‌లోనే ఉండిపోయాయి. జిల్లాలో 18 మండలాల్లో 243 గ్రామçపంచాయతీలు, 508 గ్రామాలున్నాయి. అంతర్గత ఆదా య వనరులు లేకపోవడం.. ప్రభుత్వ పరంగా అవసరాలకు సరిపడా నిధులు రాకపోవడంతో గ్రామపంచాయతీల్లో పాలన కత్తిమీద సాములా మారింది.

తాగునీటి పథకాలు, వి ద్యుత్‌ బిల్లుల భారం గ్రామపంచాయతీ ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారింది. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో బిల్లులు భారంగా మారుతున్నాయి. పంచాయతీల్లో విద్యుత్‌ బిల్లులు ఎక్కువగా రావడానికి నియంత్రణ లేకపోవడం ఓ కారణంగా చెప్పవచ్చు. కొన్ని గ్రామాల్లో విద్యుత్‌ బల్బులు నిరంతరం వెలుగుతుంటాయి. దీని వల్ల విద్యుత్తు వృథా కావడంతో బిల్లులు పేరుకుపోతున్నాయి. సిబ్బంది ద్వారా గ్రామాల్లో పర్యవేక్షణ ఉంటే విద్యుత్‌ వృథాను అరికట్టవచ్చని పలువురు పేర్కొంటున్నారు. ఏళ్ల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉండకుండా ప్రతీనెల ఎంతో కొంత చెల్లించ డం ద్వారా భారం తగ్గే అవకాశముంది.

30 శాతం   చెల్లించాల్సిందే..
గ్రామపంచాయతీల్లో పేరుకపోయిన విద్యుత్‌ బిల్లులు 14వ ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి చెల్లించాలి. మొదటి విడత నిధుల్లో 10 శాతం మాత్రమే చెల్లించారు. రెండో విడతలో 30 శాతం చెల్లించాలి్సందే. ఇప్పటికే దీనికి సంబంధించిన పత్రాలను డీపీవోకు అందజేశాం. ఏఈల ద్వారా పంచాయతీలకు నోటీసులు ఇచ్చాం. – సి.శ్రీనివాస్, అసిస్టెంట్‌ అకౌంట్‌ ఆఫీసర్, విద్యుత్‌శాఖ

Advertisement
Advertisement