పుష్కరఘాట్లకు ప్రభుత్వం తూట్లు | Sakshi
Sakshi News home page

పుష్కరఘాట్లకు ప్రభుత్వం తూట్లు

Published Sat, Jul 30 2016 12:30 AM

పుష్కరఘాట్లకు ప్రభుత్వం తూట్లు

 
భవానీపురం : 
కృష్ణా పుష్కరాల సందర్భంగా నగరంలో చేపట్టిన పుష్కర ఘాట్ల నిర్మాణంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను అన్నారు. పుష్కరాలకు ముందే ఘాట్ల నిర్మాణం పూర్తి చేస్తామని అర్భాటపు ప్రకటనలు చేసిన జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు భక్తులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన భవానీఘాట్, పున్నమిఘాట్‌లను సందర్శించారు. 
అక్కడ ఇంకా 50 శాతం పనులుకూడా పూర్తికాకపోవడంతో ప్రభుత్వ అలసత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భవానీఘాట్‌లో ఇంకా మెట్లు నిర్మాణ పనులు జరగుతుండటం చూసి ఆశ్చర్యపోయారు. ఆయన మాట్లాడుతూ అరకొర పనులతో ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేస్తోందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను చూస్తే రోజుకు 24 గంటలు కాదుగదా 30 గంటలపాటు చేసినా ఘాట్లు పుష్కరాల నాటికి పూర్తి అయ్యే పరిస్థితి లేదన్నారు. పైగా నిర్మాణంలో నాణ్యత ప్రశ్నార్థకమేనన్నారు. 
దండుకోవడానికే హడావుడి పనులు
కనీసం ఆరు నెలలముందు ప్రారంభించాల్సిన పుష్కర పనులను ఆలస్యంగా చేపట్టడంలో అంతరార్ధం టీడీపీ నాయకుల స్వప్రయోజనాలేనని ఉదయభాను ఆరోపించారు. ముందుగా పనులు ప్రారంభిస్తే  టెండర్లు పిలవాల్సి వస్తుందని, అందుకే ఆలస్యంగా మొదలుపెట్టి టీడీపీ నాయకుల బినామీలకు నామినేషన్‌ పద్ధతిపై  అడ్డగోలుగా అప్పగించారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో పుష్కర ఘాట్ల పనులను పూర్తి చేసి యాత్రీకులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అక్బర్, చలమలశెట్టి సత్యనారాయణ, మారం వెంగళరెడ్డి ఉన్నారు. 
 

Advertisement
Advertisement