చూపులకు సుందరాంగి! | Sakshi
Sakshi News home page

చూపులకు సుందరాంగి!

Published Fri, Jul 29 2016 11:09 PM

చూపులకు సుందరాంగి!

శింగనమల నియోజకవర్గం పుట్లూరుకు చెందిన రామకృష్ణ... బతుకు తెరువు కోసం ఓ గాలిమిషన్‌ ఏర్పాటుచేసుకున్నాడు. మూడేళ్ల క్రితం ఒంగోలు జాతికి చెందిన ఆవుదూడను రూ. 14 వేలు వెచ్చించి కొనుగోలు చేశాడు. రోజులు గడుస్తున్న కొద్ది అది కొత్త రూపును సంతరించుకోసాగింది. దీంతో దాని పోషణపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.
అందానికే అందం
చూస్తుంటే ముద్దులొలుకుతున్న ఆవును మరింత సుందరంగా అలకరించే పనిలో రామకృష్ణ నిమగ్నమయ్యాడు. దాని కోసం ప్రత్యేకంగా గౌషన్‌లు, మెడపట్టీ, కాళ్ల గజ్జెలు, కొమ్ము కుచ్చులు, పూసల హారాలు సమకూర్చాడు. వాటిని అప్పుడప్పుడు దానికి అలంకరించి ఆనందించేవాడు. పాల నురుగులాంటి శరీరంపై నల్లటి దారాలతో అలంకరించిన ఆవును చూసేందుకు స్థానికులు ఎగబడ్డేవారు.


అందాల పోటీలకు
గత ఏడాది ఏప్రిల్‌లో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నిర్వహించిన ఆవుల అందాల పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి మేలు జాతి ఆవులు వచ్చాయి. ఈ పోటీలకు తన ఆవును రామకృష్ణ తీసుకెళ్లాడు. దాదాపు 750కు పైగా ఆవులు వివిధ అంశాల్లో ప్రతిభ చాటుకునేందుకు పోటీ పడ్డాయి. వాటన్నింటిని వెనక్కు నెట్టేసి రామకృష్ణ ఆవు ప్రథమస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా రూ. 15వేలుతో పాటు ప్రశంసాపత్రాన్ని నిర్వాహకులు అందజేశారు.
సంక్రాంతి సంబరాల్లోనూ...
ఈ ఏడాది ప్రభుత్వం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో సైతం ఈ ఆవు అందాల పోటీల్లో పాల్గొని మండల, జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించింది. మండల స్థాయిలో రూ.4 వేలు, జిల్లా స్థాయిలో రూ. 8 వేలు ప్రోత్సాహక నగదు తన యజమానికి దక్కేలా చేసింది. ఈ సందర్భంగా మంత్రుల చేతుల మీదుగా రామకృష్ణ  సత్కారం అందుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement